ఏపీలో పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్

 

వాయువ్య బంగాళాఖాతంలో  ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు అనుకుని నిన్న ఏర్పడిన అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతుందని వాతావరణ విభాగం తెలిపింది. దీంతో ఏపీలో పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలను ఐఎండీ జారీ చేసింది. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్‌ హెచ్చరికలను జారీ చేసింది. 

ఆ క్రమంలో ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల ప్రజలకు ప్రభుత్వం సూచించింది. తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, కేంద్ర పాలిత ప్రాంతం యానాంకు ఫ్లాష్‌ ఫ్లడ్‌ హెచ్చరికలు జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించింది. అలాగే వివిధ శాఖల ఉన్నతాధికారుల సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. ఒక వైపు భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో వివిధ జిల్లాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లంకపల్లి వద్ద బుడమేరు వాగుకు భారీగా వరద నీరు పెరిగింది. 

ఈ నేపథ్యంలో ఉంగుటూరు - ఉయ్యూరు మార్గంలో రాక పోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అలాగే భారీ వర్షాల కారణంగా.. జగ్గయ్యపేటతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ఎన్టీఆర్ జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నందిగామ, అవనిగడ్డ, జగ్గయ్యపేట, ఉంగుటూరు, గుడివాడ సమీపంలోని బ్రిడ్జిల పైనుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. జిల్లాలోని 5 మండలాల్లో 100కుపైగా గ్రామాల్లో రాకపోకులు నిలిచి పోయాయి. ఇక మున్నేరు, కట్లేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

నదీ పరివాహక ప్రాంతాలు, లంక గ్రామాల్లో నివసించే ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ఎవరూ వరద నీటిలో ఈతకు వెళ్లవద్దని, చేపల వేట కోసం నదిలోకి ప్రవేశించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. నాటు పడవలపై ప్రయాణాలు ప్రమాదకరమని హెచ్చరించారు. ముందుజాగ్రత్త చర్యగా కళింగపట్నం, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం పోర్టులలో ప్రమాద సూచికలను ఏర్పాటు చేశారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu