మూసీకి భారీ వరద.. ముంపు ప్రాంతాల ప్రజల తరలింపు
posted on Sep 26, 2025 10:48PM

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది మహోగ్రరూపం దాల్చింది. పోటెత్తి ప్రవహిస్తున్నది. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. చాదర్ ఘాట్, శంకర్ నగర్ లో నివసిస్తున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.
పురానాపూల్ ప్రాంతంలో మూసీ వరద రోడ్లను ముంచెత్తింది. జియాగూడ ప్రాంతంలో కూడా మూసీ ఉగ్రరూపం దాల్చింది. అక్కడ కూడా వరద నీరు రోడ్లపైకి రావడంతో రాకపోకలను నిలిపివేశారు. స్థానికులను అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ హెచ్చరించారు. ముసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేశారు.
ఇక వికారాబాద్ లో మూసీ ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో టంగుటూరు మోకిల రోడ్డును మూసి వేశారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లలో నీటిమట్టం పెరగడంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో మూసీ వరద ఉధృతి మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.