మల్లోజుల లొంగుబాటు..మావోయిస్టు ఉద్యమానికి బిగ్ సెట్ బ్యాక్!

మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు సీనియర్ నాయకుడు, మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనూ ఆయధాలను వీడి పోలీసులకు లొంగిపోయారు. విశ్వసనీయ సమాచారం మేరకు మల్లోజుల దాదాపు 60మంది మావోయిస్టులతో కలిసి మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఆయుధాలను వీడి పోలీసులకు లొంగిపోయారు. మల్లోజుల లొంగు బాటును  కేంద్ర హోంశాఖ నుంచి కానీ, మహారాష్ట్ర పోలీసుల నుంచి కానీ అధికారికంగా ధృవీక రించలేదు. అయితే మల్లోజుల లొంగిపోయాన్న సమాచారం కేంద్ర హోంశాఖ వర్గాల నుంచే వచ్చిందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.  

అయితే మల్లోజుల లొంగుబాటు వార్త పెద్దగా ఆశ్చర్యం కలిగించడం లేదని పరిశీలకులు అంటున్నారు. ఇటీవలే మావోయిస్టు పార్టీ చేసిన శాంతి చర్చల ప్రతిపాదన వెనుక ఉన్నది మల్లోజుల వేణుగోపాలే అంటున్నారు. ఆ ప్రతిపాదనకు కేంద్రం ఆంగీకరించలేదు.. అది వేరే సంగతి, కానీ ఆ ప్రతిపాదన సమయంలోనే  సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమించి కేంద్రంలో చర్చలకు సిద్ధమని మల్లోజుల ప్రకటించారు. ఆ ప్రకటన అప్పట్లో సంచలనం సృష్టించింది. అప్పటి నుంచీ మల్లోజులకు మావోయిస్టు కేంద్ర కమిటీతో దూరం పెరిగిందని అంటున్నారు. ఒక దశలో మల్లోజులను మావోయిస్టు పార్టీ ఉద్యమ ద్రోహిగా కూడా ప్రకటించింది.  ఈ నేపథ్యంలోనే మల్లోజుల లొంగుబాటు నిర్ణయానికి వచ్చి ఉంటారని పరిశీలకులు అంటున్నారు.  

మల్లోజుల వేణుగోపాల్  మావోయిస్టు పార్టీలో చాలా సీనియర్ నాయకుడు. ఆయన స్వస్థలం పెద్దపల్లి. మల్లోజుల వేణుగోపాల్  సోదరుడు మల్లోజుల కోటేశ్వరరావు  అలియాస్ కిషన్ జీ గతంలో పార్టీలో రెండో స్థానంలో ఉండేవారు. ఆయన  2011 నవంబర్ 24న పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించారు. మల్లోజుల కోటేశ్వరరావు మరణం తరువాత మావోయిస్టు పార్టీలో మల్లోజుల వేణుగోపాల్ అత్యంత కీలక పాత్రపోషించారని నిఘా వర్గాలు చెబుతున్నాయి.  కిషన్ జీ భార్య, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు కూడా అయిన పోతుల  అలియాస్ సుజాత కూడా గత నెలలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. అంతకు ముందే మల్లోజుల వేణుగోపాల్ భార్య తార కూడా పోలీసులకు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు వార్త వాస్తవమే అయితే మావోయిస్టు ఉద్యమ చరిత్రలోనే ఇది కీలకమలుపు అవుతుందని అంటున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu