అన్నగారి బర్త్‌డే వస్తోంది..భారతరత్న గుర్తొస్తోంది..!

తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులు. ప్రఖ్యాత సినీనటులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు. ఒక వ్యక్తి ఒక రంగంలో నిష్ణాతుడైతేనే అతనిని అందలం ఎక్కించే మన నేతలు/ప్రభుత్వాలు. ఎన్టీఆర్ లాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి విషయంలో మాత్రం చిన్నచూపు చూశాయి..చూస్తునే ఉన్నాయి. దేశంలో ఎంతోమందికి దేశ అత్యున్నత పౌర పురస్కరం భారతరత్న ఇచ్చినా..ఎన్టీఆర్‌కు మాత్రం ఆ అవకాశం దక్కలేదు. నిజానికి ఎన్టీఆర్ చేసిన పనులకు ..ఆయన సిద్ధాంతాలకు ఎన్నో అవార్డులు వరించాల్సి ఉంది. కానీ..కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టిన వ్యక్తి కావడం ఆయనకు శాపంగా మారింది. అన్నగారి జయంతులప్పుడో..వర్థంతులప్పుడో భారతరత్న డిమాండ్ నేతల ఉపన్యాసాల్లో భాగంగా మారుతోంది. ఆ వేడుక ముగియగానే మళ్లీ అటకమీదకు నెట్టడమూ షరా మామూలైపోయింది.

 

ఈ నేపథ్యంలో నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్‌ను ఏపీ టీడీపీ ఎంపీ మురళీమోహన్ తెర మీదకు తీసుకొచ్చారు. ఎన్టీఆర్ గొప్పతనాన్ని లోక్‌సభలో వివరించిన ఆయన...ఎవరికి సాధ్యం కాని రీతిలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. నట సార్వభౌముడికి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఈనాటిది కాదు. తెలుగుదేశం పార్టీ గతంలో కేంద్రప్రభుత్వానికి వినతిపత్రాలు అందజేసింది. నందమూరి కుటుంబం, అభిమానులు, ప్రజలతో పాటు అన్నగారి సతీమణి లక్ష్మీ పార్వతి సైతం ఢిల్లీకి వెళ్లి మరీ అవార్డు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. మరి ఇంత జరుగుతున్నా కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదు.

 

1988లో భారతరత్న అవార్డు పొందిన ఎంజీ రామచంద్రన్ ప్రాంతీయ పార్టీని స్థాపించారు. ముఖ్యమంత్రిగా సేవలందించారు. అచ్చం అలాంటి పోలికలే ఉన్న ఎన్టీఆర్ మాత్రం ఢిల్లీ పెద్దలకు కనిపించడం లేదు. స్వయంగా ఎన్టీఆర్ అల్లుడు, టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తరచూ మామగారికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఒక్క మాటతో దేశానికి రాష్ట్రపతిని, ప్రధానిని ఎంపిక చేసేంత కింగ్ మేకర్ చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తికి సొంత మామకి భారతరత్న అవార్డు ఇప్పించడం చిటికెలో పని. చంద్రబాబు సిఫారసు మేరకు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇస్తే ఎవరు పురస్కారాన్ని అందుకుంటారనే దానిపై చర్చ సాగుతోంది.

 

మరణించిన వ్యక్తికి భారతరత్న ఇస్తే నిబంధనల ప్రకారం దానిని తీసుకునే అర్హత అతని భార్యకే ఉంటుంది. ఒకవేళ ఆమె కూడా లేకపోతే వారిద్దరి సంతానం వెళ్లి అవార్డును అందుకోవచ్చు. లక్ష్మీపార్వతి ఆ అవార్డును అందుకోవడం టీడీపీ అధినేతకు ఇష్టం లేదు. అలాగని ఎన్టీఆర్ సంతానం వెళ్లి దానిని అందుకున్నా వివాదం రేగడం ఖాయం. అందుకే అన్నగారి విషయంలో ఏళ్లుగా జాప్యం జరగుతోంది. కనుక గతంలో జరిగిన తప్పును వర్తమానంలో సరిచేయడం ద్వారా..ఆ మహనీయుడిని గౌరవించాలని తెలుగుజాతి కోరుకుంటోంది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu