బెంగళూరు కంపెనీకి లోకేష్ ఆహ్వానం
posted on Sep 18, 2025 12:35PM
.webp)
మంత్రి నారా లోకేష్ ఎక్కడున్నా ఏపీ అభివృద్ధిపై ఫోకస్ పెడుతున్న తీరు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. తాజా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న లోకేష్ బెంగళూరుకు చెందిన ఒక కార్పొరేట్ కంపెనీని విశాఖకు ఆహ్వానిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు హాట్ టాపిక్ గా మారింది. బెంగళూరులో రవాణా కష్టాలు, మౌలిక సదుపాయాల కొరతకు తోడు.. రహదారుల అధ్వాన పరిస్థితి కూడా జాతీయ స్థాయిలో చర్చకు దారి తీస్తున్నాయి. అలాగే అక్కడి సంస్థలు బెంగళూరులో కొనసాగడంపై పునరాలోచనలో పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే బెళ్లందూరు ఔటర్ రింగ్ రోడ్డులో ఉన్న బ్లాక్‌బక్ అరే కంపెనీ సీఈఓ రాజేష్ యాబాజి సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టుపై ఏపీ మంత్రి నారా లోకేష్ వేగంగా స్పందించారు.
విషయమేంటంటే.. దేశంలో అతి పెద్ద డిజిటల్ ట్రక్కింగ్ ఫ్లాట్‌ఫాంగా ఉన్న బ్లాక్‌బక్ అరే సంస్థను 2015లో నెలకొల్పారు. గతంలో ఇంటి నుంచి కార్యాలయానికి వెళ్లి రావడం తేలికగా ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయని, ఆఫీసుకు రావాలంటే తమ ఉద్యోగులకు గంటన్నర సమయం పడుతోందని బ్లాక్‌బక్ సీఈఓ రాజేష్ యాబాజి సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. రోడ్లన్నీ గుంతలు, దుమ్ముతో నిండిపోయాయని, గత అయిదేళ్లలో ఈ పరిస్థితుల్లో మార్పేమీ రాలేదని, దీంతో తాము తమ సంస్థను ఇక్కడ నుంచి తరలించాలని నిర్ణయించుకున్నామనీ ఆ పోస్టులో పేర్కొన్నారు. ఆ పోస్టుపై వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేష్.. ‘హాయ్ రాజేష్, మీ కంపెనీని విశాఖకు ఆహ్వానిస్తున్నా అంటూ రిప్లై ఇచ్చారు.
.webp)
భారత్‌లోని అత్యుత్తమ 5 పరిశుభ్రమైన నగరాల్లో విశాఖ ఒకటి. అక్కడ మౌలిక సుదుపాయాలను మెరుగుపరుస్తున్నారం. మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా విశాఖకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. మీ సంస్థను విశాఖకు తరలించే విషయంపై మీ అభిప్రాయాన్ని నాకు నేరుగా సందేశం పంపండి అంటూ లోకేష్ పేర్కొన్నారు. లోకేష్ రాష్ట్ర ప్రగతి, రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పన విషయంలో చూపుతున్న ఆసక్తి, శ్రద్ధలకు ఇది నిలువెత్తు నిదర్శనం అంటూ సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.