కేరళ అమ్మాయిలు లుంగీలు కట్టడం వెనుక మర్మమేంటి..?
posted on Jun 8, 2016 3:44PM

ఢిల్లీలో నిర్భయపై జరిగిన అమానుషకాండ తర్వాత..దేశంలో మహిళల పట్ల పెరుగుతున్న అత్యాచారాల తర్వాత పెద్ద చర్చ మొదలైంది. సాంప్రదాయ భారతీయ వస్త్ర ధారణను పక్కనబెట్టి..పాశ్చాత్య వస్త్ర ధారణను అలవాటు చేసుకోవడం వల్లే స్త్రీలపై అత్యాచారాలు ఎక్కువవుతున్నాయని చాలా మంది పలు రకాల వాదాలను తెరపైకి తీసుకువచ్చారు. లోక్‌సభ సాక్షిగా తెలుగుదేశం ఎంపీ మురళీమోహన్ కూడా భారతదేశ సంస్కృతిని నిలబెట్టుకునేందుకు..నా అక్కాచెల్లెళ్లు, కూతుళ్లు, బాలికలు హుందాగా ఉండే వస్త్రాలు ధరించాలని చెప్పడంతో ఈ వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. అలా కొంతకాలం పాటు సైలెంట్ అయిన ఈ వాదన కొత్తరకంగా మరోసారి బయటకు వచ్చింది. దేశంలోని వివిధ దేవాలయాల్లోకి ప్రవేశించే మహిళలు సంప్రదాయ వస్త్రాలు ధరించే ఆలయాల లోపలికి ప్రవేశించాలని కొన్ని దేవాలయ పాలకమండళ్లు ఆదేశాలు జారీ చేశాయి. దీనిపై భూమాతా బ్రిగేడ్ లాంటి సంస్థలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. గుడిలోకి వచ్చే వారు కల్మషం లేని మనసుతో, భక్తి భావంతో ఉండాలని దానికి వస్త్రధారణతో పనిలేదని భూమాతా బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు తృప్తీదేశాయ్ వ్యాఖ్యనించారు.
ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటిస్థానంలో ఉన్న కేరళలో అమ్మాయిల వస్త్ర ధారణపై విధించిన ఆంక్షలు బయటపడ్డాయి. ఓ కళాశాల యాజమాన్యం అమ్మాయిలు జీన్స్ ప్యాంట్ వేసుకుని తరగతులకు హాజరవ్వకూడదని నిషేధం విధించింది. దీనిని నిరసిస్తూ అమ్మాయిలు లుంగీలు కట్టి, మగళ్లలా మోకాళ్లపైకి లుంగీని మడిచికట్టి ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసలు కేరళలో అలాంటి నిషేధం ఏమి లేదని ఆ ఫోటోలు నిరసన తెలిపేందుకు కాదని శ్రీమంతుడు సినిమాలో మహేశ్ లుంగీని అనుకరించడానికే సరదాగా అమ్మాయిలు అలా చేశారని వాదన వినిపిస్తోంది. మరో వాదన ప్రకారం..గతేడాది మలయాళీ పండుగ ఓనంను పురస్కరించుకుని ఎర్నాకులంలోని ఓ కళాశాలలో అమ్మాయిలు లుంగీలు కట్టి డ్యాన్స్ చేసేముందు ఫోటో తీసుకున్నారని ఇలా భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కేరళలో అమ్మాయిల లుంగీ ఫోటో సంచలనాన్ని రేకిత్తిస్తోంది.