కేసీఆర్‌కి ఉగ్ర, మావో ముప్పు
posted on May 1, 2015 12:00PM

రాజకీయ నాయకులు ప్రజల్ని కాపాడే సంగతి అలా వుంచితే, అధికారంలోకి వచ్చిన వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడంతోనే సరిపోతుంది. ఇది ఏ ఒక్క పార్టీకి చెందిన రాజకీయ నాయకుల పరిస్థితో కాదు.. దేశవ్యాప్తంగా అధికారంలో వున్న నాయకులందరి పరిస్థితీ ఇలాగే వుంది. తమకు ఎటువైపు నుంచి ఏ ముప్పు వస్తుందో అర్థంకాని పరిస్థితుల్లో సెక్యూరిటీ మీద పూర్తిగా ఆధారపడే పరిస్థితికి దేశంలోని రాజకీయ నాయకులు చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు సంవత్సరం క్రితం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన కేసీఆర్ పరిస్థితి కూడా ఇలాగే మారింది. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచే ఆయనకు జడ్ ప్లస్ సెక్యూరిటీ అమలు అవుతోంది. ఆ భద్రతా ఏర్పాట్లు ఒక సంవత్సర కాలానికే ఎంతో భారీగా పెరిగిపోయాయి. ఈ సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంగతి ఎలా వున్నా, ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రతా ఏర్పాట్ల విషయంలో మాత్రం భారీ అభివృద్ధి జరిగింది. దీనికి కారణం... ఉగ్రవాదుల నుంచి, మావోయిస్టుల నుంచి ఆయనకు ముప్పు వుందన్న సంకేతాలు అందడమే.
తెలంగాణలో బాగా ప్రాబల్యం వున్న మావోయిస్టులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని ఆకాంక్షించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వారి ఆకాంక్ష నెరవేరి తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. అయితే ఆ తర్వాత వారికి కేసీఆర్ ప్రభుత్వం పనితీరు కూడా నచ్చలేదు. కేసీఆర్ నిరంకుశంగా పరిపాలన చేస్తు్న్నారని మావోయిస్టులు ఎన్నో సందర్భాలలో ప్రకటించారు. దీనికితోడు ఏడాది క్రితం వరకూ బలం తగ్గుతూ వచ్చిన మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బలం పుంజుకున్నారు. తెలంగాణలో తమ సంఖ్యను బాగా పెంచుకున్నారు. ఏదైనా బలమైన ఘటనను నిర్వహించడం ద్వారా తమ ఉనికిని మరింత బలంగా చాటుకోవాలన్న ఆలోచనలో వున్నారు. అలాంటి ఆలోచనలో వున్నవారికి ‘ముఖ్యమంత్రి’ని మించిన టార్గెట్ మరొకటి వుంటుందా? అలాగే ఉగ్రవాది వికారుద్దీన్ బృందం ఎన్‌కౌంటర్ తర్వాత ఉగ్రవాదుల కన్ను కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపేవారి మీద పడింది. వారు కూడా వీలు దొరికితే ప్రతికారాన్ని తీర్చుకోవాలన్న ‘కసి’తో వున్నారు. వీటికి తోడు ముఖ్యమంత్రి భద్రత విషయంలో జాగ్రత్తగా వుండాలంటూ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కూడా హెచ్చరికలు అందాయి. దాంతో ఇటీవలి కాలంలో కేసీఆర్ భద్రతను మరింత పెంచారు. సరికొత్త భద్రతా వాహనాలను కొనుగోలు చేశారు. దీనికితోడు కేసీఆర్ రాష్ట్రంలో పర్యటించాలంటే రోడ్డు మార్గంలో వెళ్ళడం మంచిది కాదని, కేవలం హెలికాప్టర్ మాత్రమే ఉపయోగించాలని కూడా భద్రతా వర్గాలు స్పష్టం చేశాయి. ఏది ఏమైనప్పటికీ బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తున్న కేసీఆర్ మీద ఉగ్రవాదులు, మావోలు దృష్టి కేంద్రీకరించడం మంచి పరిణామం కాదు. ఆయన సంపూర్ణ భద్రతతో వుండాలని కోరుకుందాం.