కాంగ్రెస్‌ని క్షమించాలా... సిగ్గు లేదా?



కాంగ్రెస్ నాయకులకు సిగ్గు, శరం, రోషం, పౌరుషం ఏ కోశానా ఉన్నట్టు కనిపించడం లేదు. అసలు రాజకీయ నాయకులలో ఇలాంటి లక్షణాలను ఆశించడం అత్యాశ... అది కూడా కాంగ్రెస్ నాయకులలో వీటిని ఆశించడం కేవలం అత్యాశ మాత్రమే కాదు... ఎన్నటికీ నెరవేరని దురాశ. అధికారం సాధించడం కోసం, ప్రజల నెత్తిన గుదిబండల్లా కూర్చోవడం కోసం కాంగ్రెస్ నాయకులు ఎన్ని నాటకాలు అయినా ఆడతారు. ఒక్కసారి అధికారం వాళ్ళ చేతికి వచ్చిందా... ఇక వాళ్ళ ఆటలకు, ఆగడాలకు అంతమే వుండదు... పదేళ్ళుగా దేశంలో, అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీలో ఈ దుర్మార్గాన్ని చూసిన తెలుగువారు తరించారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి, అక్రమాల గురించి రాసుకుంటూ వెళ్తే పెద్ద గ్రంథమే తయారవుతుంది. కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక విధానాలకు ఉదాహరణగా ఏదైనా చెప్పాలని అనుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడ్డగోలు విభజన ఒక్కటి చాలు. ఈ దారుణమైన విభజన కారణంగా అటు ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ రాష్ట్రం కూడా ఎన్నో ఇబ్బందులు పడుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు.. అందుకే కాంగ్రెస్ పార్టీకి రెండు రాష్ట్రాల్లో ప్రజలు చెప్పుదెబ్బలు కొట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో అయితే కాంగ్రెస్ పార్టీని తన్ని తరిమేశారు. ఆ స్థాయిలో తప్పు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ ఏపీ ప్రజలను బుట్టలో వేసుకోవడానికి నక్కజిత్తులు వేస్తోంది. దొంగ ఏడుపులు ఏడుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదేళ్ళపాటు ప్రత్యేక హోదా ఇస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పి రాజ్యసభలో విభజన బిల్లును ఆమోదింపజేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ హామీకి చట్టబద్ధత కల్పించలేదు. దాంతో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాంకేతికంగా సమస్యగా మారింది. ఏపీకి అర్జెంటుగా ప్రత్యేక హోదా ఇచ్చేయాలని పార్లమెంటులో హడావిడి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, తన నాటకాలు చూసి ఏపీ ప్రజలు నమ్మేస్తారని ఆశిస్తే అది ఆ పార్టీ అమాయకత్వమే. ఇప్పుడు ఆ పార్టీకి చెందిన నాయకుడు, జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సూరజ్ హెగ్డే కొత్త పాట మొదలుపెట్టాడు. రాష్ట్రాన్ని విభజించినందుకు తమ పార్టీని క్షమించాలని ఆయన మొత్తుకున్నాడు. ఇటీవల విజయవాడలో జరిగిన ఒక సమావేశంలో పాల్గొన్న ఆయన రాష్ట్ర విభజన చేసినందుకు క్షమించండి అంటూ లబోదిబో అన్నాడు. చూడు నాయనా సూరజ్ హెగ్డే, నువ్వు కాదు... నిన్ను పంపించిన సోనియాగాంధీ వచ్చి మొత్తుకున్నా కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు ఎప్పటికీ క్షమించరు. క్షమించడానికి మీ పార్టీ చేసింది చిన్నా చితకా నేరం కాదు... ఏపీ ప్రజల  గుండెల్లో నిర్దాక్షిణ్యంగా గునపం దించారు. అయినా ఏపీ ప్రజల్ని క్షమించమని అడగటానికి మీకు, మీ పార్టీకి సిగ్గు లేదా?

Online Jyotish
Tone Academy
KidsOne Telugu