సింహాచలానికి రాజయోగం
posted on May 1, 2015 10:40AM

విశాఖ సమీపంలోని సింహాచలం ప్రాంతానికి రాజయోగం పట్టినట్టు అనిపిస్తోంది. రాష్ట్ర విభజన పుణ్యమా అని ఇప్పుడు ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. సమైక్య రాష్ట్రంగా వున్న సమయంలో అభివృద్ధి అంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమైంది. అందుకే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి అప్పులు మాత్రం మిగిలాయి. అయితే ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, భవిష్యత్తులో జరగబోతున్న అభివృద్ధి అక్కడి ప్రజలలో నూతనోత్సాహం నింపుతోంది. ఆ ఆభివృద్ధిలో అగ్ర తాంబూలం అందుకునే దిశగా ఉత్తరాంధ్ర ప్రాంతం పయనిస్తోంది. విశాఖపట్టణం ఇప్పటికే సాఫ్ట్‌వేర్, విద్యా రంగాల్లో మరింత అభివృద్ధి సాధించబోతుంది. విశాఖపట్నం సమీపంలోనే వున్న సింహాచలం ప్రాంతం కూడా ఇప్పుడు ఊహించని స్థాయి అభివృద్ధిని అందుకోబోతోంది. స్వామినారాయణ్ ట్రస్ట్ నిర్మించే అక్షర్‌ధామ్ దేవాలయాల గురించి అందరికీ తెలిసిందే. గుజరాత్‌లో ఒక దేవాలయం వుంది. ఢిల్లీలో మరో దేవాలయం వుంది. ఇప్పుడు సింహాచలంలో కూడా ఒక దేవాలయాన్ని నిర్మించడానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. స్వామినారాయణ్ ట్రస్ట్ ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించడం, ప్రభుత్వం అందుకు సానుకూలంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం చకచకా జరిగిపోయాయి. దేవాలయ నిర్మాణానికి అవసరమైన 10 ఎకరాల అన్ని వసతులూ వున్న భూమి కోసం అన్వేషణ జరుగుతోంది. ఇప్పుడు సింహాచలానికి మరో రూపంలో రాజయోగం పట్టబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
సింహాచలంలో ‘ఆయుష్’ యూనివర్సిటీని నిర్మించాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. ఈ ప్రాంతంలో ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియో వైద్యాల సమ్మేళనం. వీటితోపాటు ప్రకృతివైద్యం కూడా ఇందులో భాగంగా వుంటుంది. ‘ఆయుష్’కి సంబంధించిన విశ్వవిద్యాలయం, ఆస్పత్రి, పరిశోధనా సంస్థ, నర్సుల శిక్షణా కేంద్రం, పారామెడకల్ సిబ్బంది శిక్షణా కేంద్రాలను సింహాచలంలో ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. ఈ మేరకు ఆయుష్ కమిషనర్ ఇటీవల సింహాచలం దేవాలయం ఇ.ఓ.ను కలసి తమ ప్రతిపాదనాలను వెల్లడించారు. ఆయుష్ యూనివర్సిటీ, పరిశోధనా కేంద్రం, ఆస్పత్రి, శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయడానికి 100 ఎకరాల భూమి అవసరం అవుతుంది. ఈ భూమి ఈ ప్రాంతంలో సింహాచలం దేవాలయానికి వున్నాయి. సింహాచలం దేవాలయానికి చెందిన ఆ భూములను ఆయుష్‌కి కేటాయించినట్టయితే దేవాలయం సమీపంలోనే విద్యాలయం, వైద్యాలయాలు కూడా ఏర్పాటు అయ్యే అవకాశం వుంటుంది. సింహాచలం ప్రాంతంలోని ప్రకృతి ఒడిలో విద్య, వైద్యాలయాలతోపాటు స్వామినారాయణ్ దేవాలయం కూడా ఏర్పాటు అయితే, వీటన్నిటికి పెద్దదిక్కుగా సింహాచలం అప్పన్న దేవాలయం ఉంటే... ఈ ప్రాంతం వైభవాన్ని చూడటానికి రెండు కళ్ళూ చాలవేమో.