తెలంగాణ రాజకీయల్లో...కవితక్క అవకాశాల వేట!
posted on Jan 26, 2026 1:38PM

తెలంగాణ రాజకీయాల్లో కవిత హడావిడి మాములుగా లేదు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని గుంపు మేస్త్రీ అని, తన బావ హరీష్ రావును గుంట నక్క అంటూ ఆమె చేస్తున్న హంగామా ఒక రేంజ్ లో ఉంది. ఒకప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ ని పొలిటికల్ కామెడీగా చిత్రీకరించిన కవిత.. తాజాగా తాను కూడా అదే పాత్ర పోషిస్తున్నారా? అన్నది అటుంచితే.. మొత్తం మీద కవిత టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ని కూడా తన పార్టీలోకి ఆహ్వానించారు. తమ జాగృతి పార్టీకి నేషనల్ కన్వీనర్ గా చేస్తామంటున్నారు.
ఇదంతా ఇలా ఉంచితే.. మాజీ మంత్రి హరీష్ రావును గుంట నక్కతో పోల్చడం అన్నది ఆమెకున్న జన్మహక్కు. ఎందుకంటే ఆయన కవితకు వరస కుదిరే బంధువు అవుతారు. బావా బావా పన్నీరు- బావను పట్టుకు తన్నీరు అంటూ ఆమె యధేచ్చగా చెలరేగిపోవచ్చు. ఆయన కూడా ఏమీ అనడానికి వీల్లేదు. ఎందుకంటే తనకింతటి రాజకీయ హోదా, పలుకుబడి, అపారమైన సిరిసంపదలకు కారణమైన మేనమామ కేసీఆర్ తనయ కాబట్టి.. పిన్ డ్రాప్ సైలెన్స్ పాటిస్తారు. కవిత ఎన్ని అన్నా హరీష్ పల్లెత్తి మాట్లాడ్డానికి వీల్లేని పరిస్థితి.
అయితే రేవంత్ రెడ్డిని ఒక ముఖ్యమంత్రి అని చూడకుండా ఆయన ఎప్పుడో అన్న మాటను అనుసరించి గుంపు మేస్త్రీ.. గుంపు మేస్త్రీ.. అని దెప్పి పొడవడమే ఏమిటీ? అన్న ప్రశ్నకు సమాధానం శోధిస్తూ వెళ్తే.. ఇక్కడ కూడా మనకో లింకు తగులుతుంది. ఇటీవల కవిత కాంగ్రెస్ లోకి గానీ వెళ్తారా? అనే టాక్ వినిపించింది. దీనికి విరుగుడుగా తనకు కాంగ్రెస్ లోకి వెళ్లే యోచన లేదు.. సొంత పార్టీ పెట్టడమే తన ధ్యేయం అన్న సంకేతాలను ఇవ్వడంలో భాగంగా.. ఆమె సీఎం రేవంత్‌ను గుంపు మేస్త్రీగా పోలుస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా.. తన బావను గుంట నక్క అని సంబోధిస్తూ.. తద్వారా తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇదిలా ఉంటే తాను కాంగ్రెస్ లోకి వెళ్లడం కాదు. ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ నే తన పార్టీలోకి ఆహ్వానించి ఆయన్ను జాతీయ కన్వీనర్ చేస్తానంటూ ఆమె అనడం చూస్తుంటే.. ఇదంతా తెలంగాణ రాజకీయ రామాయణంలో.. కవితక్క పిడకల వేటగా కామెంట్లు చేస్తున్న వారున్నారు. ఏది ఏమైనా.. కవిత తగ్గేదే లే అంటూ ముందుకెళ్తూనే వస్తున్నారు.