మూగ జీవాలు మనసు రాగాలు

మనిషికో మాట గొడ్డుకో దెబ్బ!!
ఇది పెద్దల మాట. 

ప్రస్తుత కాలంలో ప్రేమ, అభిమానం, నమ్మకం ఇవన్నీ దొరుకుతున్న సందర్భాలు చాలా తక్కువ. మనిషికి మనిషికి మధ్య అర్థం చేసుకునే సామర్థ్యము చాలా తగ్గిపోయింది.పసిపిల్లలు, మూగజీవాల దగ్గర దొరికే ఆనందం, ప్రేమ మరెక్కడా దొరకవు అనేది ఒప్పుకోవలసిన నిజం. ముఖ్యంగా జంతువులతో స్నేహం చేసేవారి మనసు ఎంతో జాలి, దయ, కలిగి ఉంటాయని అంటుంటారు. 

జంతువుల పెంపకం ఎలా ఎక్కడ మొదలయ్యిందో కానీ, మనిషికి, ప్రకృతికి మధ్య ఈ జంతువులు అనుసంధాన కర్తలుగా మారిపోయాయని చెప్పవచ్చు.  మొదట అవసరాల కోసం జంతువులను పెంచుకోవడం మొదలుపెట్టి ఇప్పుడు అదొక విలాసవంతమైన జీవితానికి స్టేటస్ లా మారిపోయింది.

కాసింత అన్నం పెట్టామంటే రోజంతా ఇంటి ముందరే ఉంటూ తమ విశ్వాసాన్ని ప్రకటిస్తాయి. ఎక్కడికైనా వెళ్తుంటే వెంట వచ్చి నేనున్నా నీతో అనే స్నేహహస్తాన్ని ఇస్తాయి. ప్రమాదాలను పసిగడతాయి, రక్షణ కల్పిస్తాయి. ఇలా బోలెడు సంగతులున్నాయి పెంపుడు జంతువుల గురించి.  అయితే కాలంతో పాటు కొన్ని మారినట్టు జంతువుల విషయంలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కొన్ని జంతువుల ఉనికి మెల్లిగా మాయమైపోతోంది. పక్షులు, జంతువులు మానవుడి నాగరిక కృత్యాలకు అంతరించిపోతున్నాయి. 

మాంసం, అవయవాలు, చర్మం వీటికోసం కొన్ని జంతువులను మనిషి చంపుకుంటూ పోతూ చివరికి ఆ జంతు జాతులను అంతం చేస్తున్నాడు. అడవి జాతుల జంతువులు ఇలానే తగ్గిపోయాయి, ఇంకా తగ్గిపోతూ ఉన్నాయి. అడవులను ఇష్టానుసారం నరికేయడం వల్ల వాటికి నివసించే వెసులుబాటు లేక, అవి ప్రజల మధ్యకు వస్తున్నాయి కానీ, లేకపోతే వాటికి అడవిలో ఉన్నంత హాయి మరెక్కడా ఉండదని ఆలోచించరేం??

జంతువులను హంగు కోసం పెంచేవాళ్ళు ఉంటారు. అలాంటివాళ్ళు వాటిని కట్టేస్తూ, కొడుతూ, వాళ్ళు చెపినట్టు వినాలని, వాటి నుండి ఎంటర్టైన్ పొందాలని చూస్తారు. ఇది చాలా తప్పు అని విషయం మాత్రం వాళ్ళు గ్రహించరు. డబ్బు పెట్టి పెట్స్ ను కొనుక్కున్నంత మాత్రాన వాటిని హింసించే అధికారం ఎవరికి ఉండదు అనే విషయం అందరూ తెలుసుకోవాలి. 

పిల్లలకు ప్రేమ, జాలి, దయ పెంపొందాలంటే మొక్కల పెంపకం, జంతువుల పెంపకానికి మించిన ఉత్తమ మార్గం వేరొకటి లేదని చెప్పాలి. జంతువులను ట్రీట్ చేసే విధానం, వాటికి ఆహారం పెట్టడం, అసహ్యించుకోకుండా ఉండటం వంటివి పిల్లలకు నేర్పాలి. ముఖ్యంగా వీధి కుక్కలు, పిల్లులు,పిచ్చుకలు, కాకులు  మొదలైనవాటికి ఆహారం, నీరు వంటివి పెట్టడం ద్వారా వ్యక్తిత్వ విలువు పెరగడం గమనించవచ్చు.

జంతు సంరక్షణ కోసం ఎన్నో చట్టాలు వచ్చినా అవన్నీ కూడా చట్టలుగా మిగలకుండా ఆచరణలోకి రావాలంటే ప్రతి ఒక్కరూ వాటి విషయంలో బాధ్యతగా ఉండాలి. 

అయితే ఈ పెంపుడు జంతువుల విషయంలో మరొక విషయం కూడా చెప్పుకోవాలి. ప్రస్తుత కాలం  అనుసరించి మనిషికి సంక్రమించే జబ్బులకు జంతువులు కూడా కాస్తో, కూస్తో కారణం అవుతున్నాయి. కాబట్టి వాటిని పెంచుకోవడంలో అభ్యంతరాలు ఉండకూడదు కానీ, వాటిని పడక గదిలో, వంటగదిలో, అందరూ భోజనం చేసే స్థలాలు మొదలైన వాటికీ దూరంగా ఉంచాలి. వాటిని ముద్దుపెట్టుకోవడం వంటివి చేయకూడదు. 

జంతువులు కూడా ఈ ప్రపంచంలో మనుషులతో పాటు నివసించే జీవులే. వాటి కంటే మనిషి పరిధి విస్తృతం అయినంత మాత్రాన వాటిని తక్కువగా చూస్తూ వాటి పట్ల అమానుషంగా ప్రవర్తించకూడదు. 

అక్టోబర్ 4, world animal day సందర్భంగా అయినా ఈ విషయాలు పిల్లలకు కూడా తెలియబరిచి జంతువుల పట్ల మనుషుల వైఖరి ఉన్నతంగా ఉండేలా చేయాల్సిన అవసరం ఎంతో ఉంది.

ఎందుకంటే జంతువులు మునుషులకంటే ఉన్నతమైన హృదయం కలిగినవి మరి!!

◆ వెంకటేష్ పువ్వాడ