ఏపీపై బీజేపీ మాట మారింది సరే.. మరి తీరు?

మాట మామిడల్లం.. మనసు పటికబెల్లం.. జగన్ ప్రభుత్వం విషయంలో బీజేపీ తీరు సరిగ్గా ఇలాగే ఉంది. జగన్ పాలన అంతా అవినీతి, కుంభకోణాల మయం అంటూ ఘాటు విమర్శలు గుప్పించే బీజేపీ అగ్రనేతలు.. చేతల్లో మాత్రం అన్ని విధాలుగా సహకరిస్తూ వస్తున్నారు. ఈ నాలుగేళ్లలో కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ , కుంభకోణాల, అవినీతి జగన్ పాలనకు వత్తాసు పలికింది. ఈ మాటలు వేరే ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు.

ఏపీలో తాజాగా పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, అమిత్ షాలు జగన్ పాలనపై చేసిన విమర్శలే ఆ విషయాన్ని చెబుతున్నాయి. ఇష్టారీతిన అప్పులకు అనుమతులు ఇచ్చింది కేంద్రంలోని మోడీ సర్కారే. ఆ అప్పుల చలవతోనే జగన్ సర్కార్ సంక్షేమ పథకాలను అరకొరగానైనా కొనసాగించగలిగింది. ఇప్పుడు అదే బీజేపీ అగ్రనేతలు జగన్ సర్కార్ పై విమర్శల దాడి చేస్తున్నారు. తిరుపతిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, ఆ తరువాత ఒక్క రోజు వ్యవధిలోనే విశాఖలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా  వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో అవినీతి, కుంభకోణాలే చేసిందని విమర్శలు గుప్పించారు. విశాఖను అసాంఘిక శక్తులకు అడ్డాగా చేశారని దుయ్యబట్టారు. రైతులకు మాటల్లోనే తప్ప చేతల్లో చేసిందేమీ లేదని కుండబద్దలు కొట్టారు.  మైనింగ్, గంజాయి , మద్యం మాఫియాలకు ఏపీ అడ్డాగా మారిందన్నారు. నాలుగేళ్లో కేంద్రం… ఏపీకి రూ. ఐదు లక్షల కోట్లు ఇచ్చిందని.. ఆ డబ్బులకు తగ్గట్లుగా ఏపీలో అభివృద్ధి అభివృద్ధి కనిపించలేదని అమిత్ షా విరుచుకుపడ్డారు. ఆ నిధులకు లెక్కలు చెప్పాలని నిలదీశారు.

 కేంద్ర పథకాలకు జగన్మోహన్ రెడ్డి తన పేరు .. బొమ్మలు పెట్టుకుంటున్నారని.. చివరికి ఉచితంగా ఇచ్చిన బియ్యానికి కూడా జగన్ తన ఫోటో పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.   తొమ్మిదేళ్ల పాలనలో మోడీ ప్రభుత్వం సాధించిన విజయాల ప్రచారం కోసం ఏర్పాటు చేసిన సభలే అయినప్పటికీ నడ్డా, అమిత్ షాలు ఇద్దరూ కూడా  ఆ విషయం కంటే ఏపీలో వైఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, కుంభకోణాలపై విమర్శలకే ఎక్కువ సమయం కేటాయించారు.  ఆయా సభల్లో  మాట్లాడిన ఇతర బీజేపీ నేతలు కూడా జగన్ సర్కార్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. అయితే వైసీపీ నేతలు మాత్రం విశాఖ వేదికగా అమిత్ షా తమ ప్రభుత్వంపై చేసిన విమర్శలను పట్టించుకోవడం లేదు. వాటిని అసలు గమనించనట్లుగా గుంభనంగా ఉన్నారు. అయితే తిరుపతి వేదికగా నడ్డా చేసిన విమర్శలపై బూతులతో విరుచుకుపడ్డారు.  

అసలు ఇప్పుడు మనం చెప్పుకోవలసింది బీజేపీ అగ్రనేతలపై జగన్ మంత్రులు, ఎమ్మెల్యేల స్పందన గురించి కాదు.. బీజేపీ అగ్రనేతలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని.  ఏపీలో నడ్డా, అమిత్ షాల సభల ఉద్దేశం నరేంద్రమోదీ తొమ్మిదేళ్ల పాలనా విజయాలను ప్రజలకు వివరించడానికి .. అయితే వారిరువురూ కూడా  జగన్ సర్కార్ పై విమర్శలకే అధిక సమయం కేటాయించారు.   ఎన్నికలు దగ్గరపడుతున్నాయి కనుక తమ ఆబోరు కాపాడుకోవాలంటే.. తమ స్టాండ్ ఏమిటో తెలియచేయాలనుకున్నారు.

వైసీపీ  ప్రభుత్వంపై విమర్శల తీవ్రత పెంచారు. మొదటి   నడ్డా  ఘాటు విమర్శలు చేస్తే.. ఒక రోజు వ్యవధిలో ఏపీకి వచ్చిన అమిత్ షా దాదాపు వాటినే  మళ్లీ చెప్పారు. ఇదంతా వైసీపీ విషయంలో తాము క్లియర్ గానే ఉన్నామనీ, వైసీపీ వ్యతిరేక స్టాండ్ తీసుకున్నామనీ ఏపీ ప్రజలకు చెప్పడానికే అన్నట్లుగా ఉంది. వారి ఈ వైఖరే.. ఇటీవల చంద్రబాబును హస్తిన పిలిపించుకుని మరీ చర్చించిన అంశాలేమిటన్నది చెప్పకనే చెప్పినట్లైంది.  అయితే నాలుగేళ్ల పాటు ఏపీలో జగన్ సర్కార్ అక్రమాలు, అవినీతి, కుంభకోణాలకు వంత పాడి.. లేకపోతే చూసీ చూడనట్లు వదిలేసి.. ఆ ప్రభుత్వానికి అవసరమైన ప్రతి సందర్భంలోనూ అండగా నిలిచి ఇప్పడు ఎన్నికలు దగ్గరపడేసరికి మాట మార్చి.. విమర్శలు ఎక్కుపెడితే ఏపీ జనం నమ్ముతారా?  మాటలు ఓకే…. మరి చేతల మాటేమిటని నిలదీయరా? అని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది.

ఇప్పటికైనా జగన్ సర్కార్ కు కేంద్రంలోని మోడీ సర్కార్ సహకారం ఆగుతుందా? అన్న అనుమానాలు పరిశీలకుల నుంచి వ్యక్తమౌతున్నాయి.  జగన్ సర్కార్ కు అవసరమైన ప్రతి సందర్భంలోనూ  అప్పులో.. నిధులో విడుదల చేసి ఆదుకున్న మోడీ సర్కార్.. ఇప్పుడు ఆ నిధులకు లెక్కలు చెప్పమని అడగి.. మేం జగన్ సర్కార్ ను కడిగేశాం అని చెప్పుకుంటే సరిపోతుందా అని అంటున్నారు.    ఈ నాలుగేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు బీజేపీ అగ్రనేతలు ఘాటు విమర్శలు చేసి చేతులు దులిపేసుకుంటే కుదరదని, ఆ వ్యతిరేకతను చేతల్లోనూ, చర్యల్లోనూ చూపితేనే ఏపీ జనం విశ్వసిస్తారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu