దేశం అభ్యంతరాలు బేఖాతర్.. మిథున్ రెడ్డికే కేంద్రం ఇంపార్టెన్స్!

తెలుగుదేశం, బీజేపీల మధ్య సఖ్యత సరే.. అసలు వైసీపీ విషయంలో కేంద్రం పెద్దలకు ఇంకా సాఫ్ట్ కార్నర్ ఉందా? ఆ పార్టీ నేతలకు కేంద్రం పెద్దల వద్ద ప్రాముఖ్యత ఇసుమంతైనా తగ్గలేదా? అంటే జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఔనని అనక తప్పదని అంటున్నారు పరిశీలకులు. తాజాగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కేంద్రం ఇచ్చిన ప్రాధాన్యత ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. మద్యం కుంభకోణం కేసులో అరెస్టై.. ఇటీవలే బెయిలుపై విడుదలైన మిథున్ రెడ్డికి ఐరాస (ఐక్యరాజ్యసమితి) జనరల్ అసెంబ్లీకి వెళ్లే భారత ప్రతినిథుల బృందంలో చోటు కల్పించింది.

తనకీ అరుదైన గౌరవం ఇచ్చినందుకు మిథున్ రెడ్డి ప్రధాని నరేంద్రమోడీకి కృతజ్ణతలు తెలిపారు. అంతే కాదు.. ఆ బృందంలో ఇటా చోటు దక్కగానే, అలా  పాస్ పోర్టు కోసం కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసేశారు. ఈ నెల 27 నుంచి న్యూయార్క్ లో జరిగే ఐరాస జనరల్ అసెంబ్లీ 80వ సమావేశానికి హాజరయ్యే భారత ఎంపీల బృందాన్ని కేంద్రం ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నాయకత్వం వహించే ఈ బృందంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి చోటు దక్కింది. అదే సమయంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్క ఎంపీకి కూడా చోటు దక్కలేదు.   ప్రపంచ దేశాలు శాంతి, భద్రత, మానవ హక్కులు, అభివృద్ధి, అంతర్జాతీయ సహకారం వంటి అత్యంత కీలకమైనఅంశాలపై చర్చించే వేదిక అయిన ఐరాస జనరల్ అసెంబ్లీకి హాజరయ్యే భారత ఎంపీల బృందంలో మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉండి, ఇటివలే బెయిలుపై బయటకు వచ్చిన మిథున్ రెడ్డికి  చోటు కల్పించడంపై తెలుగుదేశం వర్గాలలో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

మిథున్ రెడ్డి బెయిలు రద్దు చేయాలని కోరుతూ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది కూడా.  అదలా ఉంటే ఐరాసా జనరల్ అసెంబ్లీకి హాజరయ్యే భారత ఎంపీల బృందంలో తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, బీజేడీ, ఆమ్ ఆద్మీ పార్టీల ఎంపీలు కూడా ఉన్నారు. అయితే కేంద్రంలో మోడీ సర్కార్ మనుగడకు కీలక మద్దతు దారుగా ఉన్న తెలుగుదేశం నుంచి మాత్రం ఒక్కరంటే ఒక్క ఎంపీకి కూడా చోటు దక్కలేదు.  చోటు దక్కకపోవడం అటుంచి.. మిథున్ రెడ్డి ఎంపికను తెలుగుదేశం తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా కూడా కేంద్రం పెద్దలు లెక్క చేయలేదు. నిందితుడు మాత్రమే కదా.. నేరం రుజువు కాలేదుగా అంటూ తేలిగ్గా తీసుకున్నారు. 

గతంలో అంటే 2014లో కూడా తెలుగుదేశం రాష్ట్రంలో అధికారంలో ఉంది. కేంద్రంలో ఎన్డీయే సర్కార్ లో భాగస్వామ్య పార్టీగా ఉంది. అప్పట్లో కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కంటే.. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకే కేంద్రం ప్రయారిటీ ఇచ్చింది. ఇప్పుడు కూడా అదే తీరులో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu