జగన్ అందుకే బెట్టు చేస్తున్నాడా?
posted on Oct 16, 2015 5:12PM
.jpg)
రాజధాని శంఖు స్థాపన కార్యక్రమానికి ప్రభుత్వం పిలిచినా రానని జగన్మోహన్ రెడ్డి చెప్పడం విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆయన అందుకు ఒక ఎనిమిది కారణాలు తన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. కానీ ఆయన ఆ లేఖలో పేర్కొనని అసలు కారణం మరొకటి ఉండిపోయిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఆయన ఆరు రోజుల నిరాహార దీక్షని ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే అప్పుడు ప్రజలందరి దృష్టి అమరావతి శంఖుస్థాపన కోసం మొదలయిన హడావుడిపైనే ఉంది. జగన్ దీక్షని నీరుగార్చేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని వైకాపా నేతలు పదేపదే ఆరోపించదమలో ఉద్దేశ్యం అదే. వారు పైకి చెప్పలేదు కానీ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే అమరావతి శంఖు స్థాపనకి ‘మన నీళ్ళు మన మట్టి’ అంటూ హడావుడి చేసిందని భావిస్తున్నట్లున్నారు. కనుక ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న ఈ శంఖు స్థాపన కార్యక్రమంపై నుండి రాష్ట్ర ప్రజల దృష్టిని తన వైపు మళ్ళించుకొనేందుకే జగన్మోహన్ రెడ్డి తను దానికి పిలిచినా రానని చెపుతున్నట్లున్నారేమో? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తను స్వయంగా వెళ్లి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఆహ్వానిస్తానని చెప్పినప్పుడు మీడియా ఆ విషయం గురించి చాలా విశ్లేషించింది. దానితోబాటే ఈ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి వస్తారా రారా? అని అప్పుడే అనుమానం వ్యక్తం చేస్తూ అనేక కధనాలు ప్రచురించాయి. ఊహించినట్లే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అత్యంత ముఖ్యమయిన కార్యక్రమానికి హాజరు కాబోనని ప్రకటించేసి మీడియాకి మళ్ళీ చేతి నిండా పని కల్పించారు. ప్రస్తుతం మీడియాలో ప్రముఖంగా దీని గురించే చర్చ జరుగుతోంది. అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల దృష్టిని అమరావతి కార్యక్రమం నుంచి తనపైకి మళ్ళించుకొనేందుకే అటువంటి విచిత్రమయిన నిర్ణయం తీసుకొని ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆయన వేసిన ఈ ఐడియా తాత్కాలికంగా ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చును. కానీ శాస్వితంగా ఆయన రాజకీయ జీవితంలో ఒక చారిత్రిక తప్పిదంగా మిగిలిపోవడం ఖాయమని వారు అభిప్రాయపడుతున్నారు. అంతే కాదు ప్రజల దృష్టిని ఆకర్షించడం కోసం ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వలన ఆయన పట్ల ప్రజలలో మరింత విముఖత పెరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. జగన్ తీసుకొన్న ఈ నిర్ణయం వలన అధికార తెదేపా నేతలకు జగన్ స్వయంగా బలమయిన అస్త్రం కూడా అందించినట్లయిందని అభిప్రాయపడుతున్నారు. తెదేపా నేతలు తనను ఎంతగా విమర్శిస్తే అంతగా తన పేరు జనంలో మీడియాలో నానుతుందని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారేమో కానీ అది ఆయన గురించి నెగెటివ్ పబ్లిసిటీ అవుతుందని దాని వలన తనకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని గ్రహించలేకపోవడం ఆశ్చర్యమే.