శంఖుస్థాపనకి రాకపోతే ఆయనకే చెడ్డపేరు: యనమల
posted on Oct 16, 2015 3:03PM
.png)
ఆంద్రప్రదేశ్ రాజధాని శంఖుస్థాపన కార్యక్రమం తెదేపా స్వంత కార్యక్రమం అని జగన్ భావిస్తున్నారేమో తెలియదు కానీ దానికి తనను పిలిచినా హాజరు కానని లిఖితపూర్వకంగా చెప్పుకొని ప్రజలలో మరింత చులకన అయ్యారు. ఆయన వైరం తెదేపాతో దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతోనే కానీ రాష్ట్రంతో రాజధానితో కాదని అనుకొంటే ఆయన ఈ శంఖుస్థాపన కార్యక్రమానికి తప్పకుండా హాజరయ్యేవారు. కానీ పిలిచినా రానని చెప్పుకొని తన రాజకీయ అపరిపక్వతను మరొక్కమారు చాటుకొన్నారు. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి సంబందించిన రాజధాని శంఖుస్థాపన కార్యక్రమానికి పిలిచినా రానని ఆయన చెపుతారని వైకాపా నేతలు కూడా ఊహించినట్లు లేదు. అసలు జగన్ అటువంటి ప్రకటన చేసేముందు తన పార్టీలో సీనియర్లను సంప్రదించి వారి సలహాలు అడిగారో లేదో తెలియదు. అందుకే ఇంతవరకు వైకాపా నేతలు ఎవరూ కూడా స్పందించలేకపోయారు. బహుశః వారు తమ అధినేత ఇచ్చిన ఈ షాక్ నుండి నేదో రేపో కోలుకొని ఆయనను సమర్ధిస్తూ వాదించడం మొదలుపెడతారేమో?
వైకాపా నేతలు దీనిపై తమ వాదనలు ఇంకా తయారు చేసుకొంటుంటే, తెదేపా నేతలు మాత్రం తక్షణమే స్పందించారు. జగన్ ఆ విధంగా చెప్పి రాష్ట్ర ప్రజలను అవమానించారని మంత్రి పల్లె రఘునాథ రెడ్డి అన్నారు. జగన్ రాజకీయాలలోకి వచ్చి చాలా కాలం అయినా ఆయనలో ఇంకా ఫ్యాక్షనిస్ట్ లక్షణాలు పోలేదని అందుకే అంత మొండిగా చెప్పగలిగారని ఆయన అన్నారు.
ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ “జగన్ రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవడానికి మొదటి నుండి విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆయన రాజధాని నిర్మాణానికి వ్యతిరేకినని స్వయంగా లిఖిత పూర్వకంగా చాటుకొన్నారు. కనుక ఈ శంఖుస్థాపన కార్యక్రమాన్ని అడ్డుకొనేందుకు కూడా కుట్రలు పన్నుతున్నారని మాకు అనుమానం కలుగుతోంది. ఆయన రాష్ట్ర కార్యక్రమానికి పిలిచినా రానని చెప్పుకొని ప్రజలలో తనే నవ్వుల పాలయ్యారు. ఆయన వచ్చినా రాకపోయినా సంప్రదాయం ప్రకారం మేముఆయనని కూడా ఆహ్వానిస్తాం. ఈ కార్యక్రమానికి వచ్చి తన గౌరవం నిలబెట్టుకొంటారో లేక ప్రజల చేత అసహ్యింప జేసుకొంటారో ఆయన ఇష్టం,” అని అన్నారు.