జగన్ తను తవ్విన గోతిలో తనే పడ్డారా?
posted on Oct 12, 2015 7:25PM
.jpg)
ప్రత్యేక హోదాపై ప్రజలకు సమాధానం చెప్పుకోవడానికి చాలా ఇబ్బందిపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆయన మంత్రులని మరింత ఇరుకున పెడదామనే ఉద్దేశ్యంతో జగన్ నిరాహార దీక్ష మొదలుపెట్టారు. కానీ దీక్ష మొదలుపెట్టి ఆరు రోజులు పూర్తి కావస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా మంత్రులు, తెదేపా నేతలు అందరూ విమర్శలు గుప్పిస్తున్నారే తప్ప జగన్మోహన్ రెడ్డిని దీక్ష విరమించమని ఎవరూ కోరకపోవడంతో వైకాపా నేతలు కంగుతిన్నారు.
నానాటికీ జగన్ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో ఇప్పుడు తిరిగి వారే రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణమే స్పందించమని బ్రతిమాలుకొనే పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేక హోదా హామీ కోసం డిమాండ్ చేయడం మాని ఇప్పుడు జగన్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించకుండా తక్షణమే స్పందించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్రతిమాలుకోవలసి వస్తోంది. అందుకే జగన్ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది..కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని సాక్షి మీడియాలో పదేపదే చెపుతున్నారు. అది వాస్తవమే కావచ్చును కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జగన్ కి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యుల చెప్పిన విషయాలనే పరిగణనలోకి తీసుకొని చాలా కూల్ గా వ్యవహరిస్తోంది. చంద్రబాబు నాయుడు యధావిధిగా తన అధికారిక కార్యక్రమాలు, రాజధాని శంఖుస్థాపన ఏర్పాట్లలో నిమగ్నమవడమే అందుకు ఉదాహరణ. జగన్ దీక్ష విషయంలో ముఖ్యమంత్రి చాలా కటువుగా వ్యవహరించడం ద్వారా మళ్ళీ ఎప్పుడయినా జగన్ నిరవధిక నిరాహార దీక్ష చేయాలనుకొంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకొనే పరిస్థితి కల్పించారని చెప్పవచ్చును.
జగన్ కి ఏమయినా అయితే అందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైకాపా నేతలు గట్టిగా హెచ్చరిస్తున్నపటికీ మంత్రులు, తెదేపా నేతలు భయపడకుండా తిరిగి ఎదురుదాడి చేస్తున్నారు. “ప్రత్యేక హోదా కోసం ఎన్నిరోజులయినా నిరాహార దీక్ష చేయడానికి సిద్దం అని ప్రకటించిన జగన్ ఇప్పుడు బీపీ, షుగర్ లెవెల్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని” తెదేపా ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణం నాయుడు చురకలు అంటించారు.
కధ ఇంతవరకు వచ్చేక ఇప్పుడు ఆరోగ్య కారణాలతో జగన్ దీక్ష విరమించుకొంటే అది మరింత అప్రదిష్ట అవుతుంది. అలాగని రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు దీక్ష కొనసాగిస్తే అది జగన్ ప్రాణాలకే ప్రమాదం. రాష్ట్ర ప్రభుత్వం ఈవిధంగా వ్యవహరిస్తుందని వైకాపా నేతలు ఊహించకపోవడంతో ఇప్పుడు ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి ఎదురయింది. ఒకవిధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు కోసం త్రవ్విన గోతిలో వారే పడ్డారని చెప్పవచ్చును. కానీ ఇక చేసేదేమీ లేదు. చంద్రబాబు నాయుడు కరుణించి పోలీసులను పంపించి జగన్ దీక్షని భగ్నం చేసి ఆసుపత్రిలో చేర్చే వరకు అందరూ భారంగా ఎదురుచూస్తూ కూర్చోవలసిందే. ఇంకా ఆగితే ప్రమాదం కనుక ఈ అర్దరాత్రే పోలీసులను పంపించి జగన్ కి దీక్ష నుండి విముక్తి కల్పిస్తారేమో?