పాపం జగన్.. పట్టించుకునే వారే లేరా?
posted on Oct 12, 2015 6:03PM
.jpg)
కక్కలేక మింగలేక అన్నట్టు ఉంది ఇప్పుడు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లాలోని నల్లపాడు వద్ద తాను నిరాహార దీక్ష చేపట్టారు. అయితే జగన్ చేపట్టిన దీక్షకు ఎంతో మంది పార్టీ నేతలు.. ప్రజాసంఘాలు మద్దతు తెలిపినప్పటికీ అసలు పట్టించుకోవాల్సిన వాళ్లు మాత్రం పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియని సంగ్ధిగ్ధంలో ఉన్నట్టు తెలుస్తోంది. జగన్ దీక్ష చేపట్టి ఇప్పటికి ఆరు రోజులు అయిపోయింది. అయితే జగన్ కు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు జగన్ పరిస్థితి బాలేదని.. జగన్ రోజు రోజుకూ నీరసిస్తున్నారని తెలుపుతున్నారు. మరోవైపు జగన్ పరిస్థితి చూసి పార్టీ నేతల్లో ఆందోళన మొదలైనట్టు చెపుతున్నారు. ఇంతవరకూ ఒకకోణం.
అయితే జగన్ దీక్ష ప్రారంభించిన మొదటి రెండు రోజులు మాత్రం టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఆతరువాత ఏమైందో ఏమో కాని కొంచెం సైలెంట్ గానే ఉండి జగన్ దీక్షకు సంబంధించిన వివరాలు మాత్రం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వచ్చారు. ఆ తరువాత వారి పనిలో వారు బిజీగా ఉన్నారు. ఇక చంద్రబాబు నాయుడు అయితే అసలు రాష్ట్రంలో దీక్ష అనేది ఒకటి జరుగుతుందా అని అనుమానం వచ్చేంతలా అసలు ఏమాత్రం ఆవంక కన్ను కూడా ఎత్తి చూడకుండా ఏపీ నూతన రాజధాని శంకుస్థాపన పనులలో నిమగ్నమైపోయారు. అంతేకాదు పొట్టిశ్రీరాములు అప్పట్లో ఆంధ్ర రాష్ట్రం కోసం యాభై రోజులు పైగా ఆమరణ నిరాహార దీక్ష చేశారు.. జగన్ ఎన్ని రోజులు చేస్తారో చూద్దాం అని అనుకుంటున్నారుట.
ఈనేపథ్యంలో జగన్ దీక్ష చేస్తున్నా కూడా ఎవరూ పట్టించుకోకపోవడంతో దీక్ష కొనసాగించాలా లేక విరమించాలా అని పార్టీనేతలు అనుకుంటున్నారట. అసలు గత శనివారం రాత్రే జగన్ తో దీక్ష విరమింపజేయాలని చూసినా ఎందుకో ఆగిపోయి దీక్షను కొనసాగించారు. మరోవైపు జగన్ దీక్షపై టీవీ ఛానళ్లు కూడా అంతా శ్రద్ద వహిస్తున్నట్టు ఏం కనిపించడం లేదు. మరోవైపు విమర్శలు.. మొన్నటి వరకూ షుగర్ లెవల్స్ పడిపోయాయని చెప్పిన వైద్యులు మళ్లీ నిన్న షుగర్ లెవల్స్ పెరిగాయని చెప్పడంతో మళ్లీ టీడీపీ శ్రేణులు గళం విప్పారు. అంత సడెన్ గా షుగర్ లెవల్స్ ఎలా పెరుగుతాయి.. తాను రెండుగంటలకు ఒకసారి ఆహారం తీసుకుంటున్నారు అని అంటున్నారు. దీనికి తోడు దీక్ష చేస్తున్నప్పుడు కవర్ చేయని మీడియా జగన్ షుగర్ లెవల్స్ పెరిగాయి అన్న వార్తను మాత్రం బాగా ప్రసారం చేసింది. దీంతో జగన్ దీక్షపై ఎంతోకొంత సానుభూతి చూపించే వాళ్లకు కూడా డౌట్ వచ్చేలా చేశారు.
ఇదిలా ఉండగా పార్టీ నేతలు జగన్ తో దీక్ష విరమింపజేయాలని ప్రముఖులను, పోలీసులను కోరుతున్నట్టు.. వారు ప్రభుత్వాధికారులే ఏం పట్టించుకోవడం లేదు మేము మాత్రం ఏం చేయగలం అని చెపుతున్నట్టు రాజకీయవర్గాలు అనుకుంటున్నాయి. అంతేకాక ఈ దీక్ష ఏదో ఢిల్లీలో చేస్తే బావుంటుంది ఇక్కడ గల్లీలో చేస్తే ఏం లాభం ఉంటుంది అని అనుకున్న వారుకూడా లేకపోలేదు. అటు కేంద్రం నుండి.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో పాపం జగన్ కు ఏం చేయాలో తెలియడం లేదట. ఈ నేపథ్యంలో జగన్ దీక్ష కొనసాగిస్తారా? లేక విరమిస్తారా? వేచి చూడాలి.