విశాఖకు సినీ పరిశ్రమను తరలి రమ్మనడం హాస్యాస్పదం: తలసాని
posted on Oct 13, 2015 2:28PM
.jpg)
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సినీ పరిశ్రమను విశాఖకు తరలిరావాలని కోరడాన్ని తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తప్పు పట్టారు. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, జూ.ఎన్టీఆర్ వంటి అనేక మందిని చంద్రబాబు నాయుడు తన రాజకీయ అవసరాలకి ఉపయోగించుకొన్నారని వారిని అడ్డంగా పెట్టుకొని రాజకీయాలు చేసారని ఆరోపించారు. అయితే సినీ రంగానికి చెందినవారు రాజకీయాలలో ప్రవేశించడం, పార్టీల తరపున పనిచేయడం ఈరోజు కొత్తగా మొదలయినదేమీ కాదు. ఎప్పటి నుండో సాగుతోంది. తెరాసలో కూడా అనేకమంది సినీ నటులున్నారు. వారిలో విజయశాంతి వంటివారు పార్టీలో ఎదురయిన అవమానకర పరిస్థితులను తట్టుకోలేక బయటకు వచ్చేసారు. కనుక తలసాని ఇతరులను వేలెత్తి చూపనవసరం లేదు.
తెలంగాణా ఏర్పడిన తరువాత సినీ పరిశ్రమని కూడా రెండుగా విభజించుకొని తెలంగాణాకి వేరేగా సినీపరిశ్రమ ఏర్పాటు చేసుకొంటుననపుడు, ఆంధ్రా సినీ పరిశ్రమ అని ముద్రవేసిన దానిని విశాఖకు తరలిరమ్మని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆహ్వానిస్తే తలసానికి అభ్యంతరం చెప్పడమే హాస్యాస్పదంగా ఉంది. ఒకప్పుడు సినీ పరిశ్రమలోతీవ్ర భయబ్రాంతులు చేసినవారెవరో అందరికీ తెలుసు. నిజానికి అప్పుడే సినీ పరిశ్రమలో కొందరు విశాఖకు తరలిపోవాలనుకొన్నారు. కానీ అనేక కారణాల వలన ఆగిపోయారు. ఇప్పటికీ సినీ పరిశ్రమ హైదరాబాద్ లోనే కొనసాగుతున్నపటికీ, సినీ పరిశ్రమలో కూడా ఆంధ్రా, తెలంగాణా చీలిక ఏర్పడింది. అయినప్పటికీ హైదరాబాద్ లో పరిస్థితులు ఇప్పుడు కొంత చక్కబడ్డాయి కనుక సినీ పరిశ్రమ అక్కడే కొనసాగుతోంది.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సినీ పరిశ్రమ నెలకొల్పవలసి ఉంది కనుకనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సినీ పరిశ్రమను విశాఖకు తరలిరావాలని ఆహ్వానించారు. కానీ అంత మాత్రాన్న సినీ పరిశ్రమ హైదరాబాద్ నుండి విశాఖకు తరలి వచ్చేస్తుందని భావించనవసరం లేదు. సినీ పరిశ్రమలో నిర్మితమవుతున్న సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రదర్శించబడతాయి కనుక రెండు రాష్ట్రాలలో సినీ పరిశ్రమ తన వ్యవస్థలను ఏర్పాటుచేసుకోవలసిన అవసరం ఉంది. ఇప్పటికే హైదరాబాద్ అన్నీ ఏర్పాటయ్యి ఉన్నందున విశాఖలో కూడా ఏర్పాటు చేసుకోవలసి ఉంది. దానికి కూడా తలసాని అభ్యంతరం చెప్పడం హాస్యాస్పదం.