జగన్ సెక్యూరిటీ ఏజెన్సీని నిర్వహిస్తున్నారా?

జగన్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారు? ఎందుకు తీసుకుంటారు? అన్నది ఆయనకైనా తెలుసా అన్న అనుమానాలను ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యక్తం చేశారు. అసలు ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? సెక్యూరిటీ ఏజెన్సీని నిర్వహిస్తున్నారా అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించి పార్టీకి గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సెక్యూరిటీని తగ్గించడాన్ని ఆయన ప్రశ్నించారు.

నిజమే కోటంరెడ్డి తనపై నమ్మకం లేని పార్టీలో ఉండలేనంటూ ప్రకటించిన స్వల్ప వ్యవధిలోనే ఆయనకు టు ప్లస్ టు సెక్యూరిటీని వన్ ప్లస్ వన్ కు కుదించిన సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించిన కోటంరెడ్డికి వైసీపీతో అనధికారిక పొత్తు పెట్టుకున్న రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ అంకుశం సినిమాలోలా వీధుల్లో కొట్టుకుంటూ, బండికి కట్టుకుని తీసుకుపోతానని   బెదిరించారు. అటువంటి పరిస్థితుల్లో కోటం రెడ్డికి సెక్యూరిటీని తగ్గించడం అంటే జగన్ ప్రజలకు ఏం సంకేతం ఇచ్చినట్లు. ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి తనకు ఇష్టం లేని ఎమ్మెల్యేలకు సెక్యూరిటీని తగ్గించడం, లేదా ఉపసంహరించుకోవడం వంటి చర్యలకే పరిమితమవ్వడం ఏం పాలన? గతంలో తనకు, ఆ తరువాత ఆనం రామనారాయణ రెడ్డికి, ఇప్పుడు కోటం రెడ్డికి భద్రత తగ్గించడం జగన్ లోని దుర్మార్గ మనస్థత్వానికి సూచనగా రఘురామకృష్ణం రాజు అభివర్ణించారు.

ఇది ఇక్కడితో ఆగదనీ, ముందు ముందు అంటే రానున్న రోజులలో ఆయన సెక్యూరిటీ తగ్గించాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య బాగా పెరుగుతుందని జోస్యం చెప్పారు. ఇప్పుడిప్పుడే నివురు తొలగి అసమ్మతి నిప్పు బయటపడుతోందని, ఇది మరింత రాజుకునే రోజులు తొందర్లోనే ఉన్నాయనీ జోస్యం చెప్పారు. రానున్న రోజులలో పార్టీనీ, అధినేతనూ ధిక్కరించే ఎమ్మెల్యేల సంఖ్య బాగా పెరుగుతుందన్నారు. 
 కోటం రెడ్డి బాటలో మరింత మంది నడిచేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు నెల్లూరు నగర మేయర్, పలువురు కార్పొరేటర్లు, సర్పంచులు  కోటంరెడ్డితో కలిసి పార్టీ వీడడానికి సిద్ధమయ్యారనీ, దీనిని బట్టే వైసీపీలో అసంతృప్తి ఎంతగా వేళ్లూనుకుందో అర్ధం చేసుకోవచ్చని పేర్కొన్నారు.

 కోటంరెడ్డి లాంటి నాయకుడిని దూరం చేసుకున్న  జగన్మోహన్ రెడ్డి దూరదృష్టవంతుడని, జగన్మోహన్ రెడ్డి లాంటి అధినేతను కాదనుకున్న కోటంరెడ్డి అదృష్టవంతుడని రఘురామ వ్యాఖ్యానించారు.