మళ్లీ తెరపైకి యూనియన్ టెరటరీగా హైదరాబాద్.. తెలంగాణ క్యాపిటల్ వరంగల్?

కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్ ప్రతిపాదన మళ్లీ తెరపైకి వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో అంటే ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ ప్రతిపాదన బలంగా తెరపైకి వచ్చింది. అప్పట్లో ఈ ప్రతిపాదనకు ప్రస్తుత తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా అంగీకారం తెలిపారు.  అయితే తరువాత ఈ ప్రతిపాదన మరుగున పడింది. హైదరాబాద్ ను రెండు తెలుగు రాష్ట్రాల రాజధానిగా నిర్ణయించారు. పదేళ్ల పాటు రెండు తెలుగు రాష్ట్రాల రాజధానిగా హైదరాబాద్ ఉండాలని నిర్ణయించారు. రాష్ట్ర విభజన తరువాత పాలనా సౌలభ్యం కోసం, రాష్ట్రానికి సొంత రాజధాని నిర్మాణం లక్ష్యంతోనూ చంద్రబాబు అమరావతికి పాలనను షిఫ్ట్ చేశారు. పేరుకు హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాల రాజధాని అయినా.. ఆచరణలో మాత్రం హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా, అమరావతి విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగుతున్నాయి. గత ఎనిమిదేళ్లుగా ఇదే కొనసాగుతున్నప్పటికీ తాజాగా.. ఏపీ మంత్రులు రెండు రాష్ట్రాల రాజధాని హైదరాబాద్ అన్న అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించి, టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ ఏపీలో సౌకర్యాల లేమిపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వాస్తవానికి రెండు తెలుగు రాష్ట్రాల రాజధానిగా హైదరాబాద్ హోదా 2024 జూన్ తో ముగుస్తుంది. ఆ సమయానికి ఆంధ్రప్రదేశ్ కు రాజధాని నిర్మాణం పూర్తయినా, కాకపోయినా ఆ రాష్ట్రం హైదరాబాద్ పై హక్కులు కోల్పోయినట్లే. ఇంత కాలం ఊరుకుని ఇప్పుడు కొత్తగా కనిపెట్టినట్లు ఏపీ మంత్రులు హైదరాబాద్ పై హక్కు గురించి మాట్లాడటం రాజకీయ ప్రయోజనం కోసం తప్ప మరొకందుకు కాదనడంలో సందేహం లేదు. హైదరాబాద్ పై హక్కు కోసం వైసీపీ ఇప్పుడు పాకులాడినా లాభం లేదు, రాజకీయ ప్రయోజనమూ సిద్ధించదు అది వేరే సంగతి. 

కానీ హైదరాబాద్ విషయంలో కేంద్రం ఆలోచన వేరుగా ఉందన్నది పరిశీలకుల విశ్లేషణ. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం.. సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గందరగోళంలో పడేయటం లక్ష్యంగా  కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ అన్న అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకు వచ్చే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తెలంగాణకు అప్పుల విషయంలో అవరోధాలు సృష్టిస్తున్న కేంద్రం.. ఇప్పుడు రాజధాని విషయంలో కూడా మెలిక పెట్టే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. 

హైదరాబాద్ కు నలువైపులా రక్షణ శాఖ భూములు ఉండటం, రక్షణ పరంగా హైదరాబాద్ సున్నితమైన ప్రాంతం కావడంతో ఈ ప్రతిపాదనకు వ్యతిరేకత పెద్దగా రాదనీ, ఒక వేళ వచ్చినా హస్తినను ఉదాహరణగా చూపి వ్యతిరేక గళాలను సముదాయించవచ్చన్నది కేంద్రం భావనగా వారు విశ్లేషిస్తున్నారు. 
ఇక ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. గతంలో అంటే రాష్ట్ర విభజనకు ముందు.. ఏదో విధంగా రాష్ట్రం సాధించుకోవడమే లక్ష్యంగా హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అన్న ప్రతిపాదనకు తన అంగీకారం తెలిపారు. ఇప్పుడు కేంద్రం దానినే సాకుగా చూపి ఈ ప్రతిపాదనతో వేగంగా ముందుకు కదిలే అవకాశాలున్నాయంటున్నారు. ఈ పరిస్థితిని ఊహించే తెరాస సర్కార్ ప్రత్యామ్నాయ రాజధానిగా వరంగల్ ను ఎంచుకుని అక్కడ అన్ని సౌకర్యాలూ కల్పించేందుకు, అవసరమైన నిర్మాణాలకు పెద్ద ఎత్తున భూ సేకరణకు నడుంబిగించింది. ఇప్పటికే వరంగ్, ఆ చుట్టుపక్కల దాదాపు పాతిక వేల ఎకరాలను ప్రభుత్వం సమీకరించింది. ఈ సమీకరణ రాజధానిగా వరంగల్ ను అభివృద్ధి చేయాలన్న ప్రణాళికతోనేనని పరిశీలకులు చెబుతున్నారు. 

రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద నగరమైన వరంగల్ ( జిల్లాల విభజనకు పూర్వం) అభివృద్ధికి అన్ని విధాలుగా అనుకూలం. వరంగల్, హన్మకొండ, కాజీపేట కలిసి ఉన్న వరంగల్ కు రాజధాని నగరానికి ఉండాల్సిన అన్ని నగరాలూ ఉన్నాయి. అలాగే ఆదాయం విషయంలో కూడా తెలంగాణలో  హైదరాబాద్ తరువాతి స్థానంలో వరంగల్ నిలుస్తుంది. ఇప్పికే రాష్ట్రానికి రెండో ఆర్థిక రాజధానిగా విలసిల్లుతున్న వరంగల్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి వీలుగా మౌలిక సదుపాయాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది.  
కేంద్రం ఒక వేళ హదరాబాద్ ను యూనియన్ టెరిటరీగా ప్రకటిస్తే ఎలాంటి ఇబ్బందులూ లేకుండా వరంగల్ ను తెలంగాణకు రాజధానిగా రెడీమేడ్ సిద్ధం చేసే లక్ష్యంతో అక్కడ అభివృద్ధిపై టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని పరిశీలకులు అంటున్నారు.