మోడీ పర్యటన ... వంద ప్రశ్నలు!

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ద్విదశాబ్ది వార్షికోత్సవం, స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గురువారం హైదరాబాద్ వచ్చారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన మోడీకి బేగంపేట విమానాశ్రయంలో బీజేపీ నేతలు, శ్రేణులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం ప్రాంగణంలోనే బీజేపీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన మోడీ తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు సంధించారు. బేగంపేట నుంచి హెలికాప్టర్ లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ లో దిగారు. అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని ఐఎస్ బీ వరకు రోడ్డు మార్గంలో వెళ్లారు. మోడీ రోడ్డు మార్గంలో వెళ్లిన రహదారి మొత్తం రెండు వైపులా స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలతో బీజేపీ శ్రేణులు నింపేశాయి. మోడీ రాకతో బీజేపీ శ్రేణులు సందడి చేశాయి.

అయితే మోడీ టూర్ లో ఇది ఒక పార్శ్వం మాత్రమే.  హైదరాబాద్ పర్యటన సందర్భంగా  మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. తెలంగాణ అభివృద్ధికి సహాయం చేయడంలో మోడీ విఫలమయ్యారంటూ హైదరాబాద్ నగరంలో 17 చోట్ల ఈ ఫ్లెక్సీలు వేశారు. తెలంగాణలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఎక్కడ మోడీజీ అంటూ ఆ ఫ్లెక్సీల్లో ప్రశ్నించారు. కేంద్రం నుంచి తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులను ఎందుకు ఇవ్వడం లేదంటూ ఆ ఫ్లెక్సీల్లో ప్రశ్నలు లేవనెత్తారు.

ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే.. మోడీ హైదరాబాద్  పర్యటన సందర్భంగా అనేక ప్రశ్నలతో ఆయనకో బహిరంగలేఖ రాశారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టులో అవినీతిపై సీబీఐ విచారణ చేయించడానికి మీకు ఇబ్బంది ఏమిటని ఆ లేఖలో ప్రశ్నించారు. అలాగే పాలమూరు- రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని హామీలు ఎందుకు అమలు చేయడంలేదని  సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలంటే మీకు అంత చులకన ఎందుకని  నిలదీశారు. తెలంగాణపై పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలకు మోడీ క్షమాపణ చెప్పాలని అన్నారు. పసుపు బోర్డు హామీని నెరవేరుస్తారా? లేదా? అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆ లేఖలో ప్రశ్నించారు.   తెలంగాణపై మోడీకి ఏమాత్రం ప్రాధాన్యత లేకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు.

దాంతో పాటుగా కేంద్ర హోంమంత్రికి అమిత్ షాకు కూడా రేవంత్ రెడ్డి తొమ్మిది ప్రశ్నలు సంధించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అవినీతికి మేరే రక్షణగా ఉంటున్నారా? అని నిలదీశారు. నైనీ కోల్ మైన్స్ అవినీతి టెండర్ల విషయంలో చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. కాజీపేట రైలు కోచ్ ఫ్యాక్టరీని మహారాష్ట్రకు తరలించినా టీఆర్ఎస్ ఎందుకు నోరు విప్పలేదన్నారు. బీజేపీ- టీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయంటూ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు.

మొత్తం మీద ప్రధాని మోడీ హైదరాబాద్ లో రెండున్నర గంటల పర్యటన బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపింది. అదే సమయంలో ఆయనపై అటు టీఆర్ఎస్ ఇటు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నలు సంధించారు. ఒక పక్కన దేశ ప్రధాని మోడీ హైదరాబాద్ నగరంలో పర్యటనకు వస్తే.. సీఎం కేసీఆర్ ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ పేరుతో బెంగళూరుకు తుర్రుమన్నారు. దాంతో   ప్రధాని మోడీ బేగంపేట ఎయిర్ పోర్టులో దిగగానే బీజేపీ నేతలు, శ్రేణులతో మాట్లాడుతూ.. కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, టీఆర్ఎస్ పై  వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఒక వైపున టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, మరో పక్కన మోడీ వ్యాఖ్యలు, ఇంకో పక్కన రేవంత్ రెడ్డి బహిరంగ లేఖతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.