మరో మూడు రోజులు వానలే వానలు! నగరవాసులకు నరకయాతన తప్పదా?

తెలంగాణలో మరోమూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వానలు పడుతున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఇప్పటికే గత రెండు రోజులుగా (సోమ, మంగళ వారాలు) కురిసిన వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలమైన సంగతి విదితమే. ఇప్పుడు మరో మూడు రోజులు(బుధ, గురు, శుక్ర) వారాలలో భారీ వర్ష సూచన ఉందన్న వాతావరణ కేంద్రం హెచ్చరికతో నగరవాసులు బెంబేలెత్తుతున్నారు. ఇలా ఉండగా వర్ష సూచన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిందిగా జీహెచ్ఎంసీ ప్రజలకు సూచించింది. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధంగా ఉంచామని పేర్కొంది. ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది.

ఇలా ఉండగా వర్షసూచన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిందిగా అన్ని జిల్లాల కలెక్టర్లకూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇలా ఉండగా మంగళవారం నగరంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి.

ట్రాఫిక్ స్తంభించిపోయి ప్రజలు ఇక్కట్లు పడ్డారు. లక్డీకపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కోఠి, బేగంబజార్, సుల్తాన్ బజార్, అబిడ్స్, ట్రూప్ బజార్, నాంపల్లి  తదితర ప్రాంతాల్లో భారీ కురిసిన భారీ వర్షానికి ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. సోమవారం కూడా నగరంలో భారీ వర్షం కురిసన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో జనం ఆందోళనకు గురౌతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu