ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యత్వానికి కేకే రాజీనామా.. కారణమదేనా?

తెలంగాణ రాష్ట్ర సమితి సెక్రెటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు  ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్‌కు పంపించారు. అంతకు ముందే తన నిర్ణయాన్ని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా చైర్మన్ కు తెలియజేశారు. రాజీనామా లేఖలో వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నప్పటికీ కేకే రాజీనామాకు కేంద్రం తీరు పట్ల అసంతృప్తే కారణమని అంటున్నారు. మీడియా పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఆయనీ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. అలాగే కేంద్రం అనుసరిస్తున్న ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా తన రాజీనామాతో తన అసంతృప్తిని, అసమ్మతినీ తెలియజేశారని అంటున్నారు.

తన రాజీనామాకు ఎలాంటి రాజకీయ కారణాలు లేవని కేకే చెప్పినప్పటికీ  కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న ఏకపక్ష విధానాలకు నిరసనగానే   ఆయన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యత్వాన్ని వదులుకున్నారని చెబుతున్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరిస్థితి పేరుగొప్ప-ఊరుదిబ్బగా మారిపోయిందన్న భావన ఆయన పలు సందర్భాలలో తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేశారంటున్నారు.

ప్రెస్ కౌన్సిల్    ప్రతిపాదనలు,సిఫారసులను గానీ కేంద్ర ప్రభుత్వం ఇసుమంతైనా ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న అసంతృప్తితోనే కేకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

కేకే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా  పెయిడ్ న్యూస్‌పై ముఖ్య‌మైన అధ్య‌య‌నం చేసి నివేదిక స‌మ‌ర్పించిన సంగతి విదితమే. మీడియా విషయంలో కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షకు నిరసనగానే కేకే ఈ నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu