అర్ధశతాబ్దపు విజయం!!

అర్ధశతాబ్దపు విజయాన్ని గుర్తుచేసుకుంటూ దేశమంతా ఆనంద సందోహల్లో మునిగిన దినం డిసెంబర్ 16. విజయ్ దివస్ గా పిలుచుకునే ఈ దినాన సరిగ్గా యాభై సంవత్సరాల కిందట భారత్ యుద్ధరంగంలో పోరాటంలో  పాకిస్థాన్ పై విజయం సాధించింది.


రెండు దేశాలు, ఓ యుద్ధం, ఓ విజయం, ఓ కొత్త కొత్త దేశం అవతరణ, ఆ దేశానికి స్వేచ్ఛ వెరసి విజయ్ దివస్ ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోయింది. యుద్ధం అంటేనే హింస. అలాంటి హింస ఈ యుద్ధంలో చెప్పుకోవాల్సొలినంత చెప్పలేనంత ఉంది.  పాకిస్థాన్ నుండి విముక్తిని ఇవ్వడానికి బంగ్లాదేశ్ కు భారదేశం సహాయం అందిస్తూ జరిగిన ఈ యుద్ధంలో సుమారు పది మిలియన్ల జనాభా శరణార్ధులుగా వలస పోయింది. దాదాపు మూడు మిలియన్ల మంది ప్రజలు పాకిస్థాన్ సాయుధ దళాల చేతిలో చంపబడ్డారు. రెండవ ప్రపంచ యుద్ధం తరవాత జరిగిన తొలి యుద్ధం ఇదే కావడం అందులోనూ ఎంతో హింసాత్మకత కొనసాగడం. ఎట్టకేలకు భారత్ విజయం సాధించి బంగ్లాదేశ్ కు పాకిస్థాన్ చెర నుండి విముక్తి లభించడం వంటి చెప్పుకోదగ్గ విషయాలు కూడా ఉన్నాయి.

పాకిస్థాన్ నుండి విడిపోయాక స్వాతంత్ర్య దేశంగా ఆవిర్భవించిన బంగ్లాదేశ్, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గీతాన్నే తమ జాతీయగీతంగా స్వీకరించి మన దేశానికి, మన దేశ కవికి తగిన గౌరవాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. 


ఇక ఈ యుద్ధంలో పాకిస్థాన్ వైపు నుండి ఎనిమిది వేల మంది సైనికులు చనిపోయారు, ఇరవై ఐదు వేల మంది సైనికులు గాయపడ్డారు.  భారతదేశం మూడువేల మంది సైనికులను కోల్పోయింది. పన్నెండు వేల మంది సైనికులు గాయపడ్డారు. పాకిస్థాన్ వారి తొంభై మూడు వేల మంది సైనికులను భారత్ యుద్ధఖైదీలుగా, యుద్ధంలో వాళ్ళందరిని బంధించింది. ఫలితంగానే భారత్ కు నాటి యుద్ధంలో విజయం సులువైందని చెబుతారు. అయితే పై లెక్కలు చూస్తే ఒక యుద్ధం, ఒక దేశస్వతంత్రం పలితంగా  ఇరు దేశాల నుండి పదకొండు వేల మంది ప్రాణాలు యుద్ధభూమిలో కలిసిపోయాయి.  


పదమూడు రోజుల పాటు సాగిన యుద్ధంలో పదకొండు వేల ప్రాణాలు అంటే ఈ దేశాలకు పౌరులు తమ ప్రాణాలను ఎలా పణంగా  పెడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ మరణించిన సైనికుల కుటుంబాలకు దేశంలో దక్కుతున్నది ఏమిటి అంటే అయోమయం నెలకొంటుంది. అది వేరే విషయం కావచ్చు.


కానీ ఈ యుద్దానికి కారణం పాకిస్థాన్ అత్యుత్సాహమే అనిపిస్తుంది. బెంగాలీల భాషను కాదని ఉర్ధూను జాతీయ భాషగా మార్చి అంతటినీ ఉర్ధూ కిందకు తీసుకురావాలని ఆలోచనతో చిన్నగా మొదలైన కాంక్ష క్రమంగా వ్యతిరేకత చూపించే అందరి మీదా దాడులు చేయించడం, చంపించడం ఊచకోత చేపట్టడం మొదలుపెట్టింది. ఫలితంగా కాలేజీలు, విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల పై దాడి చేయించడం, విద్యార్థినిలను, మహిళలను అత్యాచారం చేయించడం. మానభంగాలు వంటి అకృత్యాలు చేయించడం మొదలుపెట్టింది. పలితంగా వీరి పైశాచికత్వంలో ముప్పై లక్షల మందిని ఛాంపినట్టు, నాలుగు లక్షల మంది మహిళపై అత్యాచారాలు చేసినట్టు బంగ్లాదేశ్ అధికారిక వర్గాలు విశ్లేషణ చెబుతుంది. ఇంతటి గోరానికి  పాల్పడిన దేశం మెడలు వంచడానికి భారత్ కృషి చేసి విజయం సాధించడంతో చరిత్రలో గొప్ప సుదినంగా  నమోదైంది విజయ్ దివస్.


ఇది మన దేశ విజయం అయితే.  స్వేచ్ఛ, స్వాతంత్రం లభించి ఒక కొత్త దేశంగా స్వాతంత్ర్య వాయువులు పీల్చుకుంటూ కొత్త జీవితాలను ప్రారంభించిన బంగ్లా సోదర, సోదరీమణులకు సంతోషాన్ని ఇచ్చిన రోజు. 


కాబట్టి

ఓ యుద్ధం

కొన్ని మరణాలు

పురివిప్పిన స్వతంత్రం, స్వేచ్ఛ

వెరసి విజయ్ దివస్. 

నాటి సైనికులకు అందరికీ సలాం చేయాల్సిందే!!

◆ వెంకటేష్ పువ్వాడ

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News