అందంతో విశ్వాన్ని గెలిచేసింది!! 

చాలామంది అందంది ఏముందిలే మనసు బాగుండాలి కానీ అంటారు. అవును నిజం మరి అందం లేకపోయినా మనసు బాగుంటే చాలు. కానీ అదే మనుషులు ఇతరులలో  లోపాలను ఎత్తి చూపుతూ ఉంటారు. అలాంటి వాళ్లకు అందం ఉన్నా వ్యర్థమే. అయితే మనసు, అందం రెండూ ఉన్నవాళ్లు కొంతమంది ఉంటారు. కానీ బయటకు ఎక్కువగా తెలియదు వీళ్ళందరి గురించి కారణం వాటి గురించి అందరికీ తెలిసే సందర్భం రాకపోవడమే. అందాన్ని మనసును స్ఫూర్తి వంతమైన వ్యక్తిత్వాన్ని కలిగి విశ్వానికి అంతటికీ విజేతగా నిలిచిన మన భారతీయ మగువ విజయాన్ని చూస్తే గర్వాంగానూ, ముచ్చటగాను అనిపిస్తుంది.

2000 సంవత్సరంలో లారా దత్తా మిస్ యూనివర్స్ గా ఎంపికైన తరువాత సుమారు 21 సంవత్సరాలకు భారతదేశం ఖాతాలో మిస్ యూనివర్స్ కిరీటం చేరడం పట్ల దేశం మొత్తం ఆనంద సంబరాల్లో ఉందనే చెప్పాలి. 

సంధూ విజయ కేతనం!!

పంజాబ్ రాజధాని చండీఘడ్ కు చెందిన హర్నాజ్ కౌర్ సంధూ భారతదేశం నుండి చివరిసారిగా 2000 సంవత్సరంలో మిస్ యూనివర్స్ గా లారా దత్తా ఎంపికైనప్పుడే పుట్టారు. ఈమె ప్రస్తుతం మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. ఈమె వయసు 21 సంవత్సరాలు, భారతదేశానికి ఈమె 21 సంవత్సరాల తరువాత యూనివర్స్ కిరీటాన్ని అందించారు. ఈ అంకెలు ఇలా కలవడం యాదృశ్చికమే అయినా కాసింత ఆశ్చర్యంగా అనిపిస్తుంది కూడా. అందాల పోటీలలో పాల్గొంటూ ఒక్కో మెట్టూ ఎక్కి వచ్చిన హర్నాజ్ కౌర్ సంధూ 2017 లో మిస్ చండీగఢ్ గానూ, 2018 లో మిస్ మాక్స్ ఎమర్జింగ్ స్టార్ గానూ, 2019లో ఫెమినా మిస్ ఇండియా  పంజాబ్ గానూ నిలిచారు. ఇక 2021 సంవత్సరంలోనే లీవా మిస్ దివా యూనివర్స్ కిరీటాన్ని కూడా అందుకున్నారు. ఈమె కొన్ని పంజాబీ చిత్రాలలో కూడా నటించారు.

 అలాంటి సంధూ 2021 సంవత్సరంలో తొలిసారిగా ప్రపంచ అందాల పోటీలకు ఆతిథ్యం ఇచ్చిన ఇజ్రాయెల్ లో అందాల పోటీలో పాల్గొని విశ్వసుందరిగా విజయకేతనం ఎగరేశారు. ఈ పోటీలో సుమారు 79 మంది పాల్గొనగా అందరినీ దాటుకుని విజయాన్ని ఒడిసిపట్టారు.

ఓ ప్రశ్న ఓ జవాబు!!

అందాల పోటీలు అంటే శరీరాన్ని చూసి ఇచ్చే బహుమతులు, తలమీద పెట్టె కిరీటాలు అనుకుంటే పొరపాటే. వ్యక్తిత్వాన్ని, ఆలోచనను ఇంకా చెప్పాలంటే మనోవిజ్ఞానశాస్త్ర ఆధారంగా మనుషుల ఆలోచనా తీరు ఎలాంటిది?? ఏ సమస్యకు ఎలాంటి నిర్ణయం తీసుకోగలుగుతారు?? ఏ ప్రశ్నకు ఎలాంటి సమాధానం ఇస్తారు అనేది కూడా పరీక్షించడం జరుగుతుంది. 

అలా సంధూ కు ఒక ప్రశ్న ఎదురయ్యింది. దానికి సరైన సమాధానం ఇచ్చి సంధూ విజేతగా నిలబడింది.

యువతకు ఒక స్ఫూర్తి మంత్రం!!

ప్రస్తుతం యువత ఒత్తిడి ఎదుర్కొంటున్నారు వాళ్ళు ఒత్తిడిని జయించడానికి నువ్వైతే ఎలాంటి సలహా ఇస్తావు అనే ప్రశ్నను ఆమె  ముందు ఉంచారు న్యాయనిర్ణేతలు.

తమ మీద తమకు పూర్తిస్థాయి నమ్మకం లేకపోవడమే యువత ఒత్తిడి ఎదుర్కోవడంలో ఎక్కువగా కారణం అవుతుంది.  ఎవరి ప్రత్యేకత వారు గుర్తించడంలోనే నిజమైన అందం దాగి ఉంటుంది. బయటకు రండి, మీకోసం మీరు గొంతెత్తండి, మీ జీవితానికి మీరే నాయకులు, నాకు నామీద పూర్తి నమ్మకం ఉంది అందుకే ఈరోజు నేను ఇక్కడిదాక రాగలిగాను. అని స్ఫూర్తివంతమైన సమాధానం ఇచ్చింది సంధూ.

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైనవారే, ఎవరూ మరొకరికి పోటీ కాదు, పోలిక అసలే కాదు. ఎప్పుడైతే ఎవరి జీవితాన్ని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడం మొదలుపెడతారో అప్పుడే వాళ్ళు నిజమైన విజయాలను చవిచూడగలరు  వంటి ఎన్నో అంతర్గత విషయాలు సంధూ ఇచ్చిన సమాదనంలో దాగున్నాయి. ఇలాంటి పరిపక్వత కలిగిన సమాధానాన్ని ఇచ్చింది కాబట్టే విశ్వసుందరిగా నిలిచింది అనుకోవడంలో సందేహం లేదు.

కాబట్టి చెప్పొచ్చేది ఏమిటంటే ప్రపంచంలో యువతకు ఎన్నో రంగాలు ఉన్నాయి. ఎవరి ఆసక్తిని బట్టి వాళ్ళు కృషి చేస్తూ ఉంటే తప్పకుండా విజేతలు అవుతారు.  విశ్వాన్ని కూడా జయించగలుగుతారు.

◆ వెంకటేష్ పువ్వాడ

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News