కేసీఆర్ హాజరు సంతకం అనే లాంఛనం కోసమేనా?
posted on Dec 29, 2025 4:29PM

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిల మధ్య రాజకీయ స్నేహం గురించి కొత్తగా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇరువురూ ఒకరి ప్రయోజనాల పరిరక్షణ కోసం మరొకరు అన్నట్లుగా నిలబడ్డారన్న సంగతి తెలిసిందే. అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
ఈ నేపథ్యంలో తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం (డిసెంబర్ 29) అసెంబ్లీ శీతాకాల సమావేశాల ప్రారంభం రోజున సభకు హాజరయ్యారు. ఇందుకు నేపథ్యం ఏమిటని చూస్తే.. గత కొన్ని రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పటి వరకూ ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటూ కేసీఆర్ చాటడంతో ఆయన అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగింది. ఆ ప్రచారానికి అనుగుణంగానే ఆయన సోమవారం (డిసెంబర్ 29) అసెంబ్లీకి హాజరయ్యారు. అయితే ఆయన సవాల్ చేసినట్లుగా అసెంబ్లీలో ఆయన గళమెత్తలేదు. సభలో ఐదారు నిముషాల పాటు.. అదీ సంతాప తీర్మానాల ఆమోదం వరకూ మాత్రమే సభలో ఉన్నారు. ఆ తరువాత బయటకు వెళ్లిపోయారు. సభలో బీఆర్ఎస్ కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, సభా కార్యక్రమాలను అడ్డుకోవడం లాంటి చర్యలకు పాల్పడలేదు. ప్రశ్నోత్తరాల సమయం సజావుగా సాగింది.
దీంతో కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యింది కేవలం అనర్హత వేటు పడకుండా ఉండేందుకు సభలో అటెండెన్స్ వేయించుకోవడానికేనన్న చర్చ మొదలైంది. సభకు హాజరై ఒక సంతకం చేసేసి మౌనంగా ఆయన సభ నుంచి నిష్క్రమించేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇక్కడే వారు కేసీఆర్ వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ తీరుతో పోలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ కూడా ఒకే ఒక సారి అసెంబ్లీకి హాజరై రిజిస్టర్ లో సంతకం చేసి, ఆ తరువాత అసెంబ్లీ సమావేశాలకు ముఖం చాటేస్తున్నారు. అసలు అసెంబ్లీ అవసరమేమిటి? ప్రజా సమస్యలపై ప్రెస్ మీట్లలో మాట్లాడితే సరిపోదా అన్న తీరులో ఆయన వ్యవహార శైలి ఉంది. ఇక ఇప్పుడు కేసీఆర్ కూడా సరిగ్గా అలానే వ్యవహరించనున్నారా అన్న అనుమానాలు అత్యధికుల్లో వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద శాసన సభ సభ్యత్వాన్ని కాపాడుకోవడానికి హాజరు వేయించుకునే లాంఛనాన్ని కేసీఆర్ పూర్తి చేసి.. తాను తన రాజకీయ మిత్రుడు, వైసీపీ అధినేత జగన్ నే ఫాలో అవుతున్నానని చాటినట్లైందని అంటున్నారు.