మీకు తెలుసా? రిలేషన్ నిలబడటానికి ఈ అబద్దాలు చెప్పినా అస్సలు తప్పు లేదట..!
posted on Sep 10, 2025 11:42AM

ప్రతి విషయంలోనూ నిజం మాట్లాడితేనే రిలేషన్ బాగుంటుందని కొందరు అనుకుంటారు. నిజాయితీ ఉన్నప్పుడు, నిజం మాట్లాడినప్పుడే ఆ వ్యక్తి జెన్యూన్ అని చెబుతూ ఉంటారు కూడా. అయితే ఎప్పుడూ నిజం మాట్లాడటం వల్ల రిలేషన్స్ లో గొడవలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. భార్యాభర్తలలో ఎవరైనా ఏదైనా నిజం చెప్పినప్పుడు.. అది గొడవకు దారితీస్తే వెంటనే వినిపించే మాట.. నీకు నిజం చెప్పాను చూడు.. నాది బుద్ధి తక్కువ అని. దీన్ని బట్టి అన్నిసార్లు నిజం చెప్పడం అంటే గొడవలను కోరి తెచ్చుకోవడమే అని అర్థం. కొన్ని సందర్భాల్లో అబద్దాలు చెప్పడం వల్ల రిలేషన్ లో గొడవలు రావడానికి బదులు ఆ బంధం బలపడే అవకాశం, ఇద్దరి మధ్య అపార్థాలు రాకుండా ఉండే అవకాశం ఉంటుందని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మూడు రకాల అబద్దాలు చెప్పడం వల్ల రిలేషన్ పాడవకుండా దృఢంగా మారుతుందని అంటున్నారు. ఇంతకీ ఆ అబద్దాలేంటో ఎందుకు మేలు చేస్తాయో తెలుసుకుంటే..
పొగడ్తలు.. మెచ్చుకోలు..
లైఫ్ పార్ట్నర్ లేదా స్నేహితుడు కొత్త హెయిర్ కట్, కొత్త పెయింటింగ్ లేదా కొత్త డ్రెస్ లేదా ఏదైనా సరే.. ఏదైనా కొత్తగా చేసినప్పుడు ఒకవేళ అది నచ్చకపోతే.. మొహం మీద బాలేదని చెప్పడం కంటే బాగుందని మెచ్చుకుంటే మేలు. నిజం చెప్పి వారిని బాధపెట్టే బదులు, వారికి ఒక చిన్న ప్రశంస ఇవ్వవచ్చు. "వావ్" లేదా "సూపర్" లాంటి పదాలతో పొగడ్త ఇవ్వడం వల్ల ఎదుటివారు సంతోషపడతారు. దీనివల్ల ఇద్దరి మధ్య బందం బలపడుతుంది. ఎప్పుడైనా తను చేసింది బాలేదని అర్థమైనా.. ఆ రోజు నన్ను బాధపెట్టడం ఇష్టం లేక ఇలా అన్నారు కదా.. అనే ఒక ఆలోచన ఎదుటివారి దృష్టిలో మిమ్మల్ని ఉన్నతంగా నిలబెడుతుంది.
మద్దతు..
తప్పులు అందరూ చేస్తారు. అయితే ఏదో ఒక సందర్భంలో.. ఒకరు ముందు ఒకరు వెనుక చేయవచ్చు. ఆ మాత్రం దానికి మనిషిని నిందించకూడదు. మరీ ముఖ్యంగా నలుగురిలో ఉన్నప్పుడు మాత్రం వ్యక్తిని ఎప్పుడూ నిందించకూడదు. ఒకవేళ నలుగురిలో ఏదైనా తప్పు జరిగినా, అందరి ముందు దోషిలా నిలబడే పరిస్థితి వచ్చినా మనిషిని వెనకేసుకురావాలి. సపోర్ట్ గా నిలబడాలి. అలా సపోర్ట్ గా ఉండటానికి నలుగురిలో అబద్దం చెప్పినా తప్పు లేదు.
భరోసా..
మనకు బాగా కావలసిన వాళ్లు, మన స్నేహితులు, మనతో చనువుగా ఉండేవారు ఎప్పుడైనా జీవితం గురించి ఇబ్బందిగా, బాధగా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు వెంటే మనకు కూడా బాగా బాధ కలుగుతుంది. భవిష్యత్తు గురించి వాళ్ల మనసులో భయం కనిపించినప్పుడో లేదా దేని గురించైనా ఏమవుతుందో అని బాధపడుతున్నప్పుడో వారికి ఊరట కలిగే విధంగా మాటలు చెప్పడం చాలా ముఖ్యం. అలాంటప్పుడు ధైర్యం చెప్పడం, భవిష్యత్తు గురించి భరోసా ఇవ్వడం, భవిష్యత్తు గురించి ఆశ కలిగేలా మాట్లాడటం చాలా ముఖ్యం. వారిలో ఆశాభావం పెరిగి వారు ఆత్మవిశ్వాసం కలుగుతుంది అంటే అలాంటి సందర్భాలలో అబద్దం చెప్పినా తప్పేం లేదు.
చివరగా చెప్పేది ఏంటంటే.. అబద్దం అనేది ఎవరినీ మోసం చేయాలని, బాధపెట్టాలని కాదు.. ఇతరులు సంతోషిస్తారని, బాధ నుండి బయటకు రాగలుగుతారని అనిపిస్తే అబద్దం చెప్పడంలో తప్పేం లేదనేది పెద్దలు కూడా చెప్పే మాట. కానీ మనిషి జీవితాన్ని ఇబ్బందులలోకి తోసేలా.. నమ్మించి మోసం చేసేలా అబద్దాలు ఎప్పటికీ ఆడకూడదు.
*రూపశ్రీ.