మనసులోని మాటను దైర్యంగా బయటకు చెప్పలేకపోతున్నారా... ఈ నిజం తెలుసుకోండి..!


కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది.  ఎదుటి వారు ఏమనుకుంటారో అనే సందిగ్ధం కూడా ఉంటుంది.  దీని వల్ల వారు చాలా విషయాలు బయటకు చెప్పలేక నిశ్శబ్దంగా ఉండిపోతుంటారు.  కానీ ఇలా నిశ్శబ్దంగా ఉండటం వల్ల  తరువాత చాలా బాధపడతారు కూడా.  అప్పుడు అలా చెప్పి ఉంటే బాగుండు, అలా చేసి ఉంటే బాగుండు అని అనుకునేవారు చాలా అధికంగా ఉంటారు. కానీ మనసులో మాటను ధైర్యంగా చెప్పడం వల్ల చాలా రకాల లాభాలు ఉన్నాయని అంటున్నారు మనస్తత్వ విశ్లేషకులు. ఇంతకూ మనసులో మాటను ధైర్యంగా బయటకు చెప్పడం వల్ల కలిగే లాభాలు ఏంటి తెలుసుకుంటే..

నమ్మకం, సాన్నిహిత్యం..

ప్రతి బలమైన సంబంధానికి ఓపెన్ కమ్యూనికేషన్ పునాది అవుతుంది. మనం మన భావాలను నిజాయితీగా వ్యక్తపరిచి, ఇతరుల మాటలను విన్నప్పుడు అపార్థాలు తొలగిపోతాయి.  నమ్మకం మరింత పెరుగుతుంది. మనసు విప్పి మాట్లాడగల  వ్యక్తులు పారదర్శకత,  పరస్పర గౌరవం కలిగి ఉంటారు. ఇది బందం దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది.

ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం..

మనసులో ఉన్న ఆలోచనలను భయం లేదా సంకోచం లేకుండా వ్యక్తం చేసినప్పుడు..  చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేశాం అనే ఒక శాటిస్పాక్షన్ ఫీలింగ్ ఏర్పడుతుంది. ఇది  ఆత్మగౌరవాన్ని పెంచుతుంది,  క్రమంగా ఇలాంటి ప్రవర్తన వల్ల ఆత్మవిశ్వాసం కూడా మెరుగవుతుంది. ఎప్పుడైనా, ఎలాంటి సందర్భంలో అయినా తన మనసులో ఉన్నది చెప్పడానికి ఎలాంటి భయం ఉండదు.

తేడాలు, పరిష్కారాలు..

జీవితంలో ప్రతి ఒక్కచోట విభేదాలు ఉండనే ఉంటాయి. అవి స్నేహం అయినా, కుటుంబం అయినా,  ప్రేమ అయినా, ఉద్యోగం చేసే చోట అయినా.. ఎక్కడైనా సరే.. విభేదాలు గొడవలుగా మారకుండా పరిష్కరించుకోవడానికి  సహాయపడుతుంది. అభిప్రాయాలను స్పష్టంగా , సంకోచం లేకుండా వ్యక్తపరిచినప్పుడు అవతలి వ్యక్తులు కూడా వినడానికి ఆసక్తి చూపిస్తారు.  ఇలా మాట్లాడటం అనేది సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది.

ఆత్మవిమర్శ..

ఏదైనా విషయాన్ని స్పష్టంగా చెప్పే అలవాటు ఉండటం వల్ల కేవలం ఇతరులతో ఏదైనా చెప్పడమే కాదు.. తమతో తాము స్పష్టంగా మాట్లాడుకోగలుగుతారు. ఇది వ్యక్తులను కన్ప్యూజన్ లేకుండా చేస్తుంది. బలాలు, బలహీనతలను గుర్తించడంలో సహాయపడుతుంది. ఇది వ్యక్తిగత అభివృద్దికి మొదటి అడుగు అవుతుంది.

మానసిక ఒత్తిడి, ఆందోళన..

భావోద్వేగాలను అణిచివేసినప్పుడు అవి లోపల ఒత్తిడి కలిగిస్తాయి. కానీ వాటిని సరైన విధంగా బయటకు వ్యక్తం చేసినప్పుడు ఒత్తిడి తగ్గుతుంది. ఇది మానసిక ఒత్తిడి,  ఆందోళన సమస్యలు పెరగకుండా ఉండటానికి కారణం అవుతుంది.

శారీరక ఆరోగ్యం..

స్పష్టంగా ఏదైనా విషయాన్ని బయటకు చెప్పడం వల్ల శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఒత్తిడి తక్కువగా ఉండటం మంచి నిద్ర, రక్తపోటు సాధారణంగా ఉంటాయి. ఇది గుండెజబ్బు, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు రాకుండా చేస్తుంది.

సక్సెస్ కోసం..

స్పష్టంగా, మంచిగా కమ్యూనికేషన్ చేయడంలో వ్యక్తి విజయం ఆధారపడి ఉంటుంది. ఉద్యోగంలో అయినా, రాజకీయంలో అయినా,  కుటుంబంలో అయినా,  బంధంలో అయినా స్పష్టంగా మాట్లాడటం వల్ల అవతలి వ్యక్తులు అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.  ఇది అన్ని చోట్ల విజయాన్ని,  గౌరవాన్ని తెచ్చిపెడుతుంది.

స్పష్టంగా మాట్లాడటం అంటే ఇతరుల పైన ఆధిపత్యం చెలాయించడం కాదు. భావాలను గౌరవంగా, పద్దతిలో వ్యక్తపరచడం. ఇతరులు ఏమనుకుంటారో అనుకోకుండా మనసులో ఉన్నది  చెప్పడం, మనసులో ఉన్నది తొక్కి పెట్టి మౌనంగా ఉండకుండా బయటకు వ్యక్తం చేయడం వల్ల మానసికంగా బలంగా ఉండటమే కాకుండా ఇతరుల ముందు సరైన విధంగా మాట్లాడటం ఎలాగో కూడా అర్థం  అవుతుంది.  కాబట్టి ఇతరుల గురించి ఆలోచించి మనసులో ఉన్నది దాచిపెట్టాల్సిన అవసరం లేదు.

                         *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu