గణితంతో గమ్మత్తులు చేసిన శ్రీనివాస రామానుజన్ జయంతి నేడు..!

గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం.  చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది.  కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి,  శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు.   ఈ సందర్బంగానే  ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే..

జాతీయ గణిత దినోత్సవాన్ని  భారత ప్రభుత్వం డిసెంబర్ 2011లో అధికారికంగా ప్రారంభించింది.  రామానుజన్ గణిత  విభాగానికి చేసిన అసాధారణ కృషికి గుర్తింపుగా డిసెంబర్ 22ని జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించింది . మరుసటి సంవత్సరం 2012 దేశవ్యాప్తంగా జాతీయ గణిత సంవత్సరంగా జరుపుకున్నారు, గణిత అభ్యాసం,  పరిశోధనలకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చే దిశగా జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రణాళికలు వేసుకోవడం,  ప్రోత్సాహం అందించడం, కృషి చేయడం.. అలాగే గణిత శాస్త్రానికి చేస్తున్న సేవలను గుర్తించి, ఆయా వ్యక్తులను గౌరవించడం వంటివి జరుగుతాయి.

డిసెంబర్ 22..

డిసెంబర్ 22న శ్రీనివాస రామానుజన్ జన్మదినం. ఆయన కృషి వందేళ్లు గడిచిన  తర్వాత కూడా నేటి మోడరన్  గణితాన్ని ప్రభావితం చేస్తోంది. గణితంలో ఆయన చేసిన పరిష్కారాలు,  సమస్యలు,  ప్రపంచం మీద ఆయన ప్రభావం మొదలైనవి గుర్తించడానికి డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటారు.ఇది ఆయనకు  నివాళిగా మాత్రమే కాకుండా, విద్యార్థులు,  పరిశోధకులు గణితాన్ని ఆవిష్కరించడం,  సాంకేతికత,  శాస్త్రీయ విచారణకు కేంద్రంగా గణితాన్ని  ప్రోత్సహించడానికి ఒక మంచి వేదిక అవుతుంది.

సుధీర్ఘ ప్రయాణం..

భారతదేశానికి, గణిత శాస్త్రానికి  అనుబంధం ఆధునిక చరిత్రది కాదు..  అనేక శతాబ్దాల ముందే ఈ అనుబంధం ఉంది. భారతదేశం గణిత శాస్త్రానికి చేసిన కృషిని క్రీస్తుపూర్వం 1200 నుండి క్రీస్తుపూర్వం 1800 వరకు గుర్తించవచ్చు. అంకగణితం, బీజగణితం,  త్రికోణమితిలో గణనీయమైన పరిణామాలతో పాటు.. దశాంశ సంఖ్యా వ్యవస్థ, సున్నా,  ప్రతికూల సంఖ్యలను  వాడటం వంటి ప్రాథమిక భావనలు భారతదేశంలో పుట్టాయి.  

దాదాపు నాల్గవ శతాబ్దం నుండి పదహారవ శతాబ్దం వరకు విస్తరించి ఉన్న భారతీయ గణిత శాస్త్రంలోని క్లాసికల్,  స్వర్ణ యుగాలలో ఆర్యభట్ట, వరాహమిహిర, బ్రహ్మగుప్త,  భాస్కర II వంటి పండితుల నుండి ముఖ్యమైన ఆవిష్కరణలు జరిగాయి. ఇంత సుధీర్ఘమైన బారత గణిత చరిత్రలో  శ్రీనివాస రామానుజ్ కూడా ప్రముఖుడు అని చెప్పడానికి ఆయన జయంతి రోజున గణిత దినోత్సవాన్ని జరుపుకుంటారు.

రామానుజ్ వారసత్వం..

గణిత విశ్లేషణ, సంఖ్యా సిద్ధాంతం, అనంత శ్రేణి,   భిన్నాలలో రామానుజన్ తన మార్గదర్శకులకు ఎప్పుడూ  గుర్తుండిపోతారు. నాటి కాలంలో ఆయనకు అధికారం, శిక్షణ అన్నీ చాలా తక్కువగా ఉన్నప్పటికీ   స్వతంత్రంగా దాదాపు 3,900 ఫలితాలను సంకలనం చేశాడు. వాటిలో చాలా వరకు  తరువాత కాలంలో  అసలైనవని,  చాలా  లోతైనవిగా నిరూపించబడ్డాయి.  ఆయన విధానం, పద్దతులు ఇరవయ్యవ శతాబ్దపు గణిత శాస్త్రంలోని కీలక రంగాలను పునర్నిర్మించాయి.  ఇరవై ఒకటవ శతాబ్దంలో పరిశోధనలను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి.

                                  *రూపశ్రీ.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu