కాంగ్రెస్ లోకి ఈటల రాజేందర్! భట్టీ విక్రమార్కతో మీటింగ్ 

తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ భవిష్యత్ కార్యాచరణపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈటల కొత్త పార్టీ పెట్టబోతున్నారని కొందరు చెబుతుండగా.. ఇప్పుడు పార్టీల్లోనే ఏదో ఒక దాంట్లో చేరతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పిన ఈటల.. రోజులు గడుస్తున్నా ఇంకా రాజీనామాపైనా నిర్ణయం తీసుకోలేదు. తన నియోజకవర్గ నేతలు, బీసీ సంఘాలు, తనకు సన్నిహితంగా ఉన్న నాయకులతో వరుస సమావేశాలు నిర్వహించినా... రాజేందర్ భవిష్యత్ కార్యాచరణపై మాత్రం క్లారిటీ రాలేదు. 

ఈటల ఏం చేయబోతున్నారని చర్చ సాగుతున్న సమయంలోనే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో  ఈటల రాజేందర్‌ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్‌లో భట్టి నివాసానికి వెళ్లి ఆయన సమావేశమయ్యారు ఈటల. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై భట్టి విక్రమార్కతో ఈటల చర్చించినట్లు సమాచారం. భట్టీ, ఈటల చర్చలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ లో చేరికపై భట్టితో రాజేందర్ మాట్లాడుతున్నారని కొందరు చెబుతున్నారు. అలాంటేది లేదని ఈటల అనుచరులు అంటున్నారు. ఎలాంటి ప్రాధాన్యత లేకుండా భట్టీతో ఈ సమయంలో రాజేందర్ సమావేశం కావడం ఉండదని, ఖచ్చితంగా కీలక అంశంపైనే ఇద్దరు చర్చించారని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

ఈటల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ విచారణకు ఆదేశించారు.  ఆ విచారణ జరుగుతున్న క్రమంలోనే ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేశారు. ఈ క్రమంలో తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌లో కార్యకర్తలు, నేతలతో చర్చించిన ఆయన.. తాజాగా హైదరాబాద్‌లో పలువురు ముఖ్యులను కలిసేందుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే భట్టి విక్రమార్కతో ఈటల సమావేశమైనట్లు తెలుస్తోంది.