చట్ట విరుద్దమైన పోస్టులపై ‘ఎక్స్’ కీలక నిర్ణయం
posted on Jan 4, 2026 1:59PM

ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ కంటెంట్ గురించి కీలక ప్రకటన చేసింది. 'ఎక్స్'లో పోస్ట్ చేసే చట్ట విరుద్ధమైన కంటెంట్‌ను పూర్తిగా తొలగిస్తామని, అలాంటి కంటెంట్‌ను పోస్ట్ చేసిన అకౌంట్లను శాశ్వతంగా సస్పెండ్ చేస్తామని వెల్లడించింది. అందుకోసం అవసరమైతే స్థానిక ప్రభుత్వాలతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. 'ఎక్స్ గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్' ఖాతా ద్వారా ఈ ప్రకటన వెలువడింది.
తమ ఏఐ ప్లాట్‌ఫామ్ 'గ్రోక్'ను ఉపయోగించి అశ్లీల కంటెంట్‌ను సృష్టించిన వారిపై, వాటిని నేరుగా అప్‌లోడ్ చేసిన వారిపై ఒకే రకమైన చర్యలు తీసుకుంటామని ఎలన్ మస్క్ హెచ్చరించారు. మస్క్ ప్రకటన అనంతరం 'ఎక్స్ గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్' కూడా అదే తరహా ప్రకటన చేసింది. 'ఎక్స్' నియమాలకు సంబంధించిన ఒక లింక్‌ను కూడా షేర్ చేసింది.
స్థానిక చట్టాలకు, నియమాలకు విరుద్ధంగా అశ్లీల, అసభ్య కంటెంట్ పెరుగుతున్నట్టు భారత ప్రభుత్వం గుర్తించి 'ఎక్స్'కు జనవరి రెండో తేదీన నోటీసులు జారీ చేసింది. 'గ్రోక్' ఉపయోగించి మహిళల అసభ్యకర చిత్రాలు సృష్టించి 'ఎక్స్'లో పోస్ట్‌లు చేయడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. 'గ్రోక్' ఉపయోగించి రూపొందించిన అశ్లీల కంటెంట్‌ను తొలగించాలని, ఈ మొత్తం ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో 'ఎక్స్' తగిన చర్యలు చేపట్టింది.