భోగాపురం ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండింగ్
posted on Jan 4, 2026 10:58AM
.webp)
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో తొలి విమానం ల్యాండింగ్ అయింది. ఢిల్లీ నుంచి భోగాపురం విమానాశ్రయానికి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఈ విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ అప్పలనాయుడు ప్రయాణించారు. ఈ ఏడాది జూన్ 26న భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి దశలో ఏటా 60 లక్షల మంది రాకపోకలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ విమానాశ్రయాన్ని అత్యంత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నారు. గతంలో విశాఖను వణికించిన హుద్‌హుద్ తుఫాను సమయంలో గాలులు గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వీచాయి.
దీనిని దృష్టిలో ఉంచుకుని భోగాపురం విమానాశ్రయ టెర్మినల్, ఇతర భవనాలను గంటకు 280 కిలోమీటర్ల వేగంతో వీచే ప్రచండ గాలులను కూడా తట్టుకునేలా అత్యంత పటిష్టంగా నిర్మించినట్లు జీఎంఆర్ సంస్థ తెలిపింది. సుమారు 3.8 కిలోమీటర్ల పొడవైన రన్‌వేతో పెద్ద విమానాలు కూడా ఇక్కడ సులభంగా ల్యాండ్ అయ్యే సౌకర్యం ఉందని పేర్కొంది. ఇది విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలకు ఉపయోగపడనుంది. భవిష్యత్తులో ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని విస్తరణకు కూడా ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి.