నోబెల్‌పై ఘాటుగా రియాక్ట్ అయిన వైట్‌హౌస్

 

ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి వెనెజులా ప్రతిపక్ష నేత మారియా కొరినా మచాడోకు దక్కడంతో అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కాస్త ఘాటుగా స్పందించింది. ఈ బహుమతి రాకున్నా అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత ట్రంప్ మాత్రం శాంతి సంప్రదింపులు, యుద్ధాలు నివరించడంతోపాటు ప్రజల ప్రాణాలు కాపాడటాన్ని కొనసాగిస్తారని స్పష్టం చేసింది. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మానవతా వాది అని అభివర్ణించింది. ఆయనకు హృదయం సైతం ఉందని గుర్తు చేసింది. ఆయన తన సంకల్ప శక్తితో పర్వతాలను సైతం కదిలించగలరని తెలిపింది. అలాంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ ఉండరంటూ చెప్పుకొచ్చింది.ఈ మేరకు అమెరికా అధ్యక్ష భవనం ప్రతినిధి స్టీవెన్ చియుంగ్  తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారు. ఈ బహుమతి అధ్యక్షుడు ట్రంప్‌కి కాకుండా.. మరొకరికి ఇస్తూ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని సైతం ఈ సందర్భంగా స్టీవెన్ చియుంగ్ విమర్శించారు. ఈ బహుమతి ఎంపిక విషయంలో శాంతి స్థానంలో రాజకీయాలు చేశారంటూ నోబెల్ కమిటీ నిరూపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత నెల ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో కూడా అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ తన శాంతి యత్నాలను పొగడ్తలతో ప్రస్తావించారు. భారత్-పాకిస్థాన్‌ మధ్య మే నెలలో ఏర్పడిన ఉద్రిక్తతలను తానే తగ్గించానని ఆయన ప్రకటించారు. అయితే, పాకిస్థాన్‌ అభ్యర్థన మేరకే కాల్పుల విరమణ జరిగిందని, ఇందులో ట్రంప్‌కు ఎటువంటి పాత్రలేదని భారత్‌ స్పష్టంచేసింది.

ఇదే కాకుండా ఇజ్రాయెల్–ఇరాన్‌, రువాండా–కాంగో, సెర్బియా–కొసోవో సహా మొత్తం ఏడు యుద్ధాలను తానే పరిష్కరించానని ట్రంప్‌ చెప్పుకున్నారు. అయితే వీటిలో చాలా వరకు పూర్తిస్థాయి యుద్ధాలు కానివి కాగా, కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

నోబెల్‌ బహుమతిపై ట్రంప్‌ ఆసక్తి కొత్తది కాదు. గతంలో మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు నోబెల్‌ బహుమతి లభించినప్పుడు, “ఏమీ చేయకుండానే ఆయనకు బహుమతి ఇచ్చారు” అంటూ ట్రంప్‌ తీవ్రంగా విమర్శించిన విషయం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu