హోదాకోసం పోరాడుతున్న కాంగ్రెస్, వైకాపాల లక్ష్యాలు వేర్వేరు
posted on Oct 24, 2015 2:04PM
.jpg)
కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు రెండూ ఈ చారిత్రిక కార్యక్రమానికి హాజరుకానందున ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ఆ రెండు పార్టీలు వేర్వేరు వ్యూహాలు అమలుచేస్తున్నాయి. వైకాపా అధికార తెదేపాని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తూ, నిరసన ప్రదర్శనలు మొదలుపెట్టగా, కాంగ్రెస్ పార్టీ తన బద్ధ శత్రువయిన మోడీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని “మట్టి సత్యాగ్రహం” ప్రారంభించింది.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని, రఘువీరారెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకొని పోరాటాలు చేస్తున్నారు. ఒకే అంశం మీద పోరాడుతున్న ఆ రెండు పార్టీల లక్ష్యాలు వేర్వేరుగా ఉండటం గమనిచినట్లయితే వాటి పోరాటం దేనికోసమో, ఎవరి మీదనో అర్ధం అవుతుంది. అవి చేస్తున్న ఆ పోరాటాలతో ప్రత్యేక హోదా రాదనే సంగతి వాటికీ తెలుసు. బహుశః అందుకే ఆ రెండు పార్టీలు ఆ అంశాన్ని ఏరికోరి భుజానికెత్తుకొన్నట్లు అనుమానించవలసి వస్తోంది. రెండు పార్టీలు ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటం వాటిని క్రమంగా దగ్గరయ్యేందుకు దోహదపడుతోంది కూడా.
రధాని నరేంద్ర మోడీ అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి హాజరయినప్పుడు ప్రత్యేక హోదా, ప్యాకేజీ గురించి ఎటువంటి ప్రకటన చేయకపోవడం వాటికి మరింత కలిసి వచ్చినట్లయింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా డిల్లీ నుంచి గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్ళు తెచ్చి చంద్రబాబు నాయుడు చేతిలో పెడితే, ఆయన ప్రత్యేక హోదా గురించి మోడీని నిలదీయకుండా వాటిని చాలా సంతోషంగా స్వీకరించారని కాంగ్రెస్, వైకాపాలు విమర్శిస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ప్రధాని మోడీ ఐడియాను మళ్ళీ అదే ఐడియాతో తిప్పి కొట్టేందుకు సిద్దం అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పుణ్యక్షేత్రాల నుండి మట్టిని సేకరించి ప్రధాని నరేంద్ర మోడీకి పంపేందుకు ఈరోజు హైదరాబాద్ లో ‘మట్టి సత్యాగ్రహం’ ప్రారంభించారు. ప్రత్యేక హోదాతో సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టంలో ఇచ్చిన అన్ని హామీలను మోడీ ప్రభుత్వం అమలుచేయవలసిందేనని ఆయన అన్నారు. అంతవరకు మోడీ ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.