ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే కొత్త ముఖ్యమంత్రి?
posted on Feb 18, 2014 1:03PM
.jpg)
మరికొద్ది సేపటిలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి, బహుశః పార్టీకి కూడా రాజీనామా చేయబోతున్నారు. ఆయన వెంట ఎంత మంది మంత్రులు, శాసనసభ్యులు బయటకి వెళ్లేందుకు సిద్దపడుతారనే దానిపైనే ఆయన కొత్తపార్టీ భవిష్యత్తు, రాష్ట్రంపై రాష్ట్రపతి పాలన విదించవలసిన అవసరం ఉందా లేదా? అనే సంగతులు స్పష్టమవుతాయి. ఒకవేళ ఆయన తనతో కనీసం 25మందికి తక్కువ కాకుండా బయటకు తీసుకువెళ్ళగలిగినట్లయితేనే కొత్తపార్టీకి పూర్తి మద్దతు ఉందని భావించవచ్చును. లేకుంటే కొత్తపార్టీ ఆలోచన కూడా అనవసరమేనని చెప్పవచ్చును. ఇక, ఒకవేళ ఆయన వెంట కనీసం 25 మంది శాసనసభ్యులు బయటకు వెళ్లేందుకు సిద్దపడినట్లయితే రాష్ట్రపతి పాలన అనివార్యమవుతుంది. బయటకు వెళ్లకుంటే వారు ప్రభుత్వంలోనే కొనసాగుతున్నట్లవుతుంది గనుక, కేంద్రం శాసనసభను తాత్కాలికంగా నిద్రావస్థలో ఉంచి, పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందగానే, మళ్ళీ సభను సమావేశపరిచి, రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను, పీసీసీ అధ్యక్షులను నియమించవచ్చును. ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డితో కేవలం పది లేదా పదిహేను మందిని మాత్రమే బయటకువెళ్ళినట్లయితే, తెరాస, మజ్లిస్ పార్టీల మద్దతుతో ప్రభుత్వం పడిపోకుండా కాపాడుకోవచ్చును. మరొక రెండు నెలలలో ఎన్నికలు జరుగనున్నందున తన ప్రభుత్వాన్ని కాపాడుకొనేందుకే కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నించవచ్చును తప్ప రాష్ట్రపతి పాలనకు మొగ్గు చూపకపోవచ్చును.