చంద్రబాబు శాసనసభ ప్రసంగాలపై పుస్తకావిష్కరణ
posted on Apr 20, 2025 5:01PM
.webp)
సీఎం చంద్రబాబు చంద్రబాబు 75వ పుట్టిన రోజు సందర్భంగా అమరావతి అసెంబ్లీ కమిటీ హాల్‌లో రెండు పుస్తకాలను రఘురామకృష్ణరాజు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆవిష్కరించారు. చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలకు సంబంధించి, రెండు పుస్తకాలను జయప్రద ఫౌండేషన్ ప్రచురించింది. పుస్తకాలను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్ధన్, సీనియర్ పాత్రికేయులు, రచయిత విక్రమ్ పూల రూపొందించారు. ‘స్వర్ణాంధ్రప్రదేశ్ సారథి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ప్రసంగాలు’ పేరుతో రెండు సంపుటాలు ప్రచురించారు.
ఐటీ విప్లవం వచ్చిన వెంటనే తెలుగు జాతికి దాని ఫలాలు అందించాలని భావించిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని పుస్తక రూపకర్త టీడీ జనార్ధన్ అన్నారు. చంద్రబాబు ఆనాడు చేసిన కృషితో ప్రతి రైతు, ప్రతికూలీ, ప్రతి కార్మికుడి ఇంట్లో ఓ ఐటీ ఉద్యోగి వచ్చారని ఆయన తెలిపారు. హైదరాబాదును సంపద ఉపాధి కేంద్రంగా మార్చిన చంద్రబాబు ఇప్పుడు అమరావతిని కూడా అలాగే నిర్మించ తలపెట్టారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో విద్యుతే లేదు అంధకారమే ఉండేదని అన్నారు. ఏదైనా కొత్త విషయాన్ని చిన్న కుర్రాడు చెప్పినా.. శ్రద్ధగా వింటూ టైమ్ మర్చిపోయి, నిత్య విద్యార్థిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేర్చుకుంటారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు అన్నారు. ఆయన సమయపాలనతో ఒకరిద్దరికి ఇబ్బంది కలిగినా.. రాష్ట్ర ప్రజలకు భవిష్యత్‌లో ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. ఆయన ఆదర్శ రాజకీయవేత్త అని కొనియాడారు. . ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.