సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా.. టీటీడీ అన్నప్రసాదానికి రూ.44 లక్షలు వితరణ
posted on Apr 20, 2025 4:00PM

ఏపీ సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారి భక్తులకు అన్నప్రసాదం కోసం భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ రూ.44 లక్షల విరాళం అందించారు. దీంతో ఈ రోజు తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి దాతతో కలిసి అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకు స్వయంగా వడ్డించారు. అన్న ప్రసాదాల రుచి, నాణ్యతపై నెల్లూరు, గుంటూరు, హైదరాబాద్, కర్నూలుకు చెందిన కొందరు భక్తుల నుంచి బీఆర్ నాయుడు అభిప్రాయాలు తెలుసుకున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, ప్రజలకు మరింత సేవ చేసే శక్తినివ్వాలని కోరుకుంటున్నాను" అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కూడా చంద్రబాబుకు బర్త్ డే విషెస్ తెలిపారు. "ముఖ్యమంత్రి చంద్రబాబుకి 75వ జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా" అంటూ ఎక్స్ లో పోస్టు చేశారు. చంద్రబాబుకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరం ప్రజాసేవకు అంకితమైన వారి జీవితం, ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్ళు సుఖశాంతులతో వర్ధిల్లాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రజలకు మరింత సుభిక్షంగా పాలన అందించేందుకు దేవుడు వారికి మరింత శక్తినివ్వాలని కోరుకున్నారు.