నేతాజీ మరణ రహస్యం ఇప్పటికయినా వీడుతుందా?
posted on Sep 18, 2015 12:40PM
.jpg)
ప్రముఖ స్వాతంత్ర్య సమరవీరుడు సుబాష్ చంద్ర బోస్ మరణం నేటికీ ఒక పెద్ద మిష్టరీగానే మిగిలి ఉంది. ఆయన విమాన ప్రమాదంలో మరణించారని కొందరు, కాదు రష్యా ప్రభుత్వం ఉరి తీసిందని మరికొందరు, నేటికీ సజీవుడుగానే ఉన్నాడని రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కానీ ఎవరూ కూడా తమ వాదనలను నిరూపించలేకపోయారు. ఈ మిష్టరీని ఛేదించేందుకు కేంద్రప్రభుత్వం ఇదివరకు రెండు కమిటీలను కూడా వేసింది. ఆ కమిటీలు ఇచ్చిన నివేదికలను కూడా కేంద్రప్రభుత్వం ఇంతవరకు రహస్యంగానే ఉంచింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద నేతాజీ జీవిత విశేషాలను, స్వాతంత్ర సంగ్రామం గురించి తెలియజేసే అనేక వందల ఫైళ్ళు, నివేదికలు ఉన్నాయి. వాటిని బయటపెడితే కొన్ని దేశాలతో సంబంధాలు దెబ్బ తింటాయనే కారణంతో వాటిని నేటి వరకు రహస్యంగానే ఉంచుతున్నాయి. కానీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ ప్రభుత్వ అధీనంలో ఉన్న 12,744 పేజీలతో కూడిన 64 ఫైళ్ళను అందులో సమాచారాన్ని ఇవ్వాళ బయటపెట్టబోతోంది. వాటినన్నిటినీ సంబంధిత నిపుణులు లోతుగా అధ్యయనం చేసిన తరువాత వాటిని బయటపెట్టడం వలన పొరుగు దేశాలతో సంబంధాలు దెబ్బ తినే అవకాశం లేడని దృవీకరించుకొన్న తరువాతనే వాటిని బయటపెట్టబోతున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. కానీ కేంద్రం అధీనంలో ఉన్న ఫైళ్ళను బయటపెట్టాలా వద్దా అనేది కేంద్రమే నిర్ణయించుకోవాలని ఆమె అన్నారు. మరికొద్ది సేపటిలో నేతాజీకి సంబంధించిన ఆ ఫైళ్ళనన్నిటినీ పశ్చిమ బెంగాల్ బయటపెట్టబోతోంది.