స్వయంగా లేఖ రాసే ధైర్యముందా బాబూ?
posted on Oct 10, 2012 4:59PM
.png)
“ఐఎంజీ భూముల వ్యవహారంలో విచారణ జరిపించి తన నిజాయతీని నిరూపించాలని కోరుతూ స్వయంగా లేఖ రాసే ధైర్యం ఉందా?” అంటూ చంద్రబాబుకి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. సిబిఐ విచారణంటే బాబుకి ఎందుకంత భయమంటూ కిరణ్ కుమార్ రెడ్డి నిలదీశారు. 2007లోనే ప్రభుత్వం విచారణ జరిపించాలని కోరిందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కోర్ట్ ఆదేశం మేరకే చంద్రబాబుపై సిబిఐ కేసు నమోదు చేస్తుందన్నారు. బాబు తన నిజాయతీని నిరూపించుకోదలచుకుంటే విచారణకు సహకరించాలని కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు పాదయాత్రను ప్రజలు పెద్దగా పట్టించుకోవడంలేదంటూ కిరణ్.. ప్రతిపక్షనేతపై విమర్శలు కురిపించారు. తెలంగాణపై తాను ఎలాంటి వ్యాఖ్యలూ చేయబోనని, అది పూర్తిగా అధిష్ఠానానికి సంబంధించిన వ్యవహారమని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రులందరిలో చంద్రబాబు నాయుడు అత్యంత అవినీతిపరుడంటూ కిరణ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఐఎంజీ భూముల వ్యవహారంలో విచారణ పూర్తి కాకుండానే ముఖ్యమంత్రి న్యాయవ్యవస్థ తీరుని ప్రభావింతం చేసే విధంగా మాట్లాడడం సబబు కాదంటూ టిడిపినేతలు కిరణ్ కుమార్ రెడ్డిని తీవ్రంగా విమర్శిస్తున్నారు.