లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీ బాబా అరెస్ట్

 

విద్యార్ధులను లైంగిక వేధించిన కేసులో చైతన్యానంద సరస్వతిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న అతడిని ఇవాళ తెల్లవారుజామున ఆగ్రాలో పోలీసులు అరెస్ట్ చేశారు. నైరుతి ఢిల్లీలోని శ్రీ శారదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్‌లో చదువుతున్న విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని  చైతన్యానంద సరస్వతిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. 

మార్చి 2025లో ఒక విద్యార్థి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కేసు దర్యాప్తు సందర్భంగా సంచలన విషయాలు బయటపడ్డాయి. మొత్తం 17 మంది విద్యార్థినులపై వేధింపులు జరిగినట్టు తేలడంతో, చైతన్యానంద పారిపోయాడు. అరెస్టు తప్పించుకోవడానికి చైతన్యానంద ముందస్తు బెయిల్ పిటిషన్ వేశాడు. కానీ ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు దాన్ని తిరస్కరించింది. 

విచారణలో అతను తాను ఐక్యరాజ్యసమితి ప్రతినిధినని చెప్పుకున్నాడని పోలీసులు కోర్టులో వెల్లడించారు. ఈ కేసు నేపథ్యంగా, చైతన్యానందకు చెందిన 18 బ్యాంకు ఖాతాలు, రూ.8 కోట్లు, 28 ఫిక్స్‌డ్ డిపాజిట్లు స్తంభింపజేశారు. ఈ నిధులు అతను పార్థసారథి పేరుతో ఏర్పాటు చేసిన ట్రస్ట్‌తో ముడిపడి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విద్యార్థినులు ఫిర్యాదులో, రాత్రిపూట తమను బలవంతంగా చైతన్యానంద గదికి పిలిపించి శారీరక సంబంధానికి ఒత్తిడి చేసేవాడని చెప్పారు. 

హాస్టల్ గదుల్లో సీసీటీవీలు అమర్చడం, విదేశీ పర్యటనలకు బలవంతం చేయడం, నకిలీ వాహన నంబర్ ప్లేట్లు వాడటం, మతాన్ని కవచంగా చేసుకుని మోసాలు చేయడం వంటి అంశాలు కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు. ఒక విద్యార్థిని తనను బలవంతంగా మధురకు తీసుకెళ్లారని పేర్కొంది. ఈ ఆరోపణలన్నింటిని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు, స్వామి చైతన్యానందపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu