దావోస్ చేరుకున్న చంద్రబాబు బృందం.. పెట్టుబడుల వేటలో చంద్రబాబుకు తోడుగా లోకేష్!
posted on Jan 20, 2025 11:58AM
.webp)
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పెట్టుబడుల వేట ఆరంభమైంది. దావోస్ లో సోమవారం (జనవరి 20) నుంచి గురువారం (జనవరి 24) వరకూ నాలుగు రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, అధికారులతో కూడిన బృందం అక్కడకు చేరుకుంది. కొద్ది సేపటి కిందట దావోస్ చేసిన చంద్రబాబు బృందానికి యూరోప్ టీటీపీ ఫోరం సభ్యులు, ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు.
దావోస్ చేరుకోగానే చంద్రబాబు పని ప్రారంభించేశారు. జ్యూరిచ్లో పెట్టుబడి దారులతో భేటీ అయ్యారు. దావోస్ లో ఏటా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు గతంలో కూడా చంద్రబాబు పలు మార్లు హాజరైన సంగతి విదితమే. చంద్రబాబు దార్శనికత, ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ విధానాల పట్ల ఇన్వెస్టర్లు, పారిశ్రామిక వేత్తలకు స్పష్టమైన అవగాహన ఉంది. గతంలో ఆయన దావోస్ పర్యటనల సందర్బంగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సారి కూడా అదే జరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ సారి చంద్రబాబుకు తోడుగా నారా లోకేష్ కూడా ఉన్నారు. ఉన్నత విద్యావంతుడు, అభివృద్ధిపై అవగాహన ఉన్న లోకేష్ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన, భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఈ సదస్సులో కీలక భూమిక పోషించనున్నారు. ఈ సదస్సులో రాష్ట్రం తరఫున ఐదు సెషన్ లలో ముఖ్యవక్తగా ప్రసంగించే అవకాశం ఉంది. అందులో మూడు సెషన్ లలో చంద్రబాబు ప్రసంగిస్తారు. మిగిలిన రెండింటిలో నారా లోకేష్ ప్రధాన వక్తగా ప్రసంగించనున్నారు.
అంతే కాకుండా ఏపీ పెవిలియన్ లో పారిశ్రామిక వేత్తలతో ముఖాముఖి భేటీలు, చర్చలలో లోకేష్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూలతలు, మెరుగైన పర్యావరణ వ్యవస్థ, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహకాల గురించి వివరించనున్నారు. అలాగే సీఎన్‌బీసీ, టీవీ 18, బిజినెస్ టుడే, ఎకనమిక్ టైమ్స్, బ్లూమ్ బర్గ్, మనీ కంట్రోల్ వంటి ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులతో ఇంటరాక్టివ్ సెషన్స్ లో నారా లోకేష్ పాల్గొననున్నారు.