కేటీఆర్ కు నేడో రేపో ఏసీబీ నోటీసులు?
posted on Jan 20, 2025 11:06AM

ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ, ఈడీలు ఒకదానికి మించి ఒకటి అన్నట్లుగా దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఈ కేసులో నిందితులను వరుసగా విచారణలకు పిలుస్తూ తమ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఏ1 బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును ఏసీబీ, ఈడీలు విచారించిన సంగతి తెలిసిందే. రెండు దర్యాప్తు సంస్థలూ కూడా ఆయన సుదీర్ఘంగా విచారించాయి. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, ఏ3గా ఉన్న హెచ్ఎండీఏ మాజీ చీఫ్ బీఎల్ఎన్ రెడ్డిలను కూడా ఏసీబీ, ఈడీలు విచారించాయి.
ఇప్పుడు తాజాగా ఈ ముగ్గురినీ విచారించేందుకు మరో సారి నోటీసులు జారీ చేయడానికి ఏసీ సమాయత్తమౌతున్నట్లు సమాచారం. రేపో మాపో నోటీసులు జారీ చేసి వీరిని విచారణకు పిలిచే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈ ఫార్ములా కేసులో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలంటూ తొలుత కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆయన పిటిషన్ ను కొట్టివేయడంతో సుప్రీం కు వెళ్లారు. అక్కడా ఆయనకు చుక్కెదురైంది. దీంతో ఏ క్షణంలోనైనా కేటీఆర్ అరెస్టౌతారన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. సుప్రీం కోర్టు లో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కేటీఆర్ అనివార్యంగా ఉపసంహరించుకున్న తరువాత ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆ సందర్భంగానే ఆయన అరెస్ట్ అవుతారని భావించినా ఈడీ ఆయనను ప్రశ్నించి వదిలేసింది.
ఇప్పుడు తాజాగా ఏసీబీ మరోసారి విచారణకు నోటీసులు జారీ చేయనుండటంతో ఈ సారి కేటీఆర్ అరెస్టు ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాల సంగతి ఎలా ఉన్నా.. ఈ కేసులో కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టులు విశ్వసించినట్లే కనిపిస్తోంది. అందుకే ఆయన క్వాష్ పిటిషన్లను తిరస్కరించాయని న్యాయ నిపుణులు సైతం అంటున్నారు. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ అరెస్టు ఖాయమని కేటీఆర్ సహా బీఆర్ఎస్ శ్రేణులు ఒక నిర్ధారణకు వచ్చేసినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన దర్యాప్తు సంస్థలపై చేస్తున్న వ్యాఖ్యలు ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని తేటతెల్లం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
లోట్ట పీసు కేసు, రేవంత్ రాసిచ్చిన ప్రశ్నలనే ఏసీబీ, ఈడీలు అడుగుతున్నాయంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా నగదు బదలీ జరిగిందని అంగీకరిస్తూనే.. దానితో తనకేం సంబంధం లేదనీ, తాను ఆదేశాలు మాత్రమే ఇచ్చాననీ, నిబంధనల ప్రచారం వాటిని అమలు చేయాలా వద్దా అన్నదానిపై నిర్ణయం తీసుకోవలసింది అధికారులే అంటూ తాను తప్పించుకుందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఈ ఫార్ములా కార్ కేసులో కేసులో నిధుల బదలాయింపు జరిగిందనీ, అందుకు తానే ఆదేశాలిచ్చాననీ చెబుతూ కూడా కేటీఆర్ తప్పు జరగలేదని, తప్పు చేయలేదనీ దబాయించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఆయనలో ప్రస్ట్రేషన్ పీక్స్ చేరిందనడానికి నిదర్శనంగా రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.