దావోస్ లో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ
posted on Jan 20, 2025 12:17PM

ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సోమవారం స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ప్రారంభం అయ్యింది. సోమవారం (జనవరి 20) నుంచి గురువారం (జనవరి 24) వరకూ నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో పాల్గొనేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ మంత్రులూ, అధికారుల బృందంతో అక్కడకు చేరుకున్నారు. తమతమ రాష్ట్రాలకు పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా దావోస్ చేరుకున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ లో కలుసుకున్నారు.

బ్రాండ్ ఏపీ నినాదంతో చంద్రబాబు, రైజింగ్ తెలంగాణ అంటూ రేవంత్ తమ తమ రాష్ట్రాలలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, తమ తమ ప్రభుత్వాలు కల్పించనున్న సౌకర్యాలు, రాయతీలను పెట్టుబడిదారలు, పారిశ్రామిక దిగ్గజాలకు వివరించి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తారు.
రాజకీయాలలో గురు శిష్యులుగా ముద్ర పడిన చందరబాబు, రేవంత్ రెడ్డిల మధ్య పెట్టుబడుల కోసం జరిగే పోటీపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో జ్యూరిచ్ విమానాశ్రయంలో ఇరువురు ముఖ్యమంత్రులూ ఎదురుపడిన సందర్భంలో అప్యాయంగా పలకరించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.