లోకేష్ కు బోత్స ఆత్మీయ పలకరింపు .. ఏం జరుగుతోంది!?
posted on Jan 27, 2026 8:44AM

వైసీపీ ఎకోసిస్టమ్ లో కొద్దో గొప్పో మర్యాదా మన్నన తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడిగితే మొదట వినిపించే పేరు బొత్స సత్యనారాయణ. రాజకీయ విభేదాలతో సంబంధం లేకుండా ఆయన ప్రత్యర్థి పార్టీల నేతలతో సైతం సుహృద్భావ సంబంధాలు కొనసాగిస్తారు. శాసనమండలిలో ఇటీవల బొత్స సత్యనారాయణ పవన్ కల్యాణ్ ను పలకరించి, ఆయనతో సంభాషించారు. వారిరువురి మధ్యా కొద్ది సేపు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. ఆ సంఘటన అప్పట్లో వైసీపీలో తీవ్ర కలకలం సృష్టించింది. బొత్స జనసేన గూటికి చేరుతారా? అన్న చర్చ కూడా జరిగింది. అయితే రాజకీయ విభేదాలు వేరు, వ్యక్తిగత పరిచయాలు వేరు అన్నట్లుగా బొత్స తన తీరుతో చాటారు.
ఇక తాజాగా బొత్స ఏపీ ఐటీ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తో కొద్ది సేపు సంభాషించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్యక్రమానికి హాజరైన బొత్స సత్యనారాయణ స్వయంగా ఐటీ మంత్రి నారా లోకేష్ వద్దకు వెళ్లి ఆయనతో కరచాలనం చేసి కొద్ది సేపు సంభాషించారు. రాజకీయ విభేదాలకు అతీతంగా సంబంధాలు కొనసాగించే విషయంలో ముందుగా ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పేరు చెబుతారు. ఇప్పుడు ఆ ఒరవడిని ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్ కూడా కొనసాగిస్తున్నారు. బొత్స సత్యనారాయణది కూడా అటువంటి వైఖరే అయినప్పటికీ, వైసీపీ నాయకుడిగా ఆయన చాలా కాలం పొలిటికల్ రైవలరీ అంటే పర్సనల్ రైవలరీయే అన్నట్లుగా వ్యవహరించారు.
అయితే ఇటీవలి కాలంలో ఆయన తన తీరు మార్చుకున్నట్లు కనిపిస్తున్నది. ముఖ్యంగా ఆయన స్వయంగా నారా లోకేష్ వద్దకు వెళ్లి పలకరించి, ఆత్మీయంగా సంభాషించడం పొలిటికల్ గా ప్రకంపనలు సృష్టిస్తోంది. బొత్స సత్యనారాయణ తీరు పట్ల వైసీపీ అధినేత జగన్ ఒకింత గుర్రుగా ఉన్నట్లు వైసీపీ వర్గాలలోనే చర్చ జరుగుతోంది.
ఇక రాజకీయవర్గాలలో సైతం బొత్స సత్యనారాయణ వైసీపీకి దూరం జరుగుతున్నారా అన్న చర్చ జరుగుతోంది. మొత్తం మీద లోకేష్ తో బొత్స భేటీ పరిణామాలు వైసీపీలో ఏ విధంగా ఉంటాయన్నది తేలాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదని అంటున్నారు. మరీ ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు బొత్స లోకేష్ తో ఆత్మీయంగా సంభాషించడం ప్రాధాన్యత సంతరించుకుంది.