వైసీపీ నేతలకు జగన్ భయంపోయిందా?
posted on Jan 27, 2026 10:01AM
.webp)
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తి కనిపిస్తున్నది. పార్టీలో వన్ నుంచి హండ్రడ్ వరకూ అన్నీ ఆయనే అన్న చందంగా వ్యవహరిస్తుండటం, సీనియారిటీకి తగిన గుర్తింపు లేకపోవడం పట్ల వైసీపీయులు అసంతృప్తితో రగిలిపోతున్నారన్న వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అయితే జగన్ హయాంలో అధికారం అండ చూసుకుని ఇష్టారీతిగా చెలరేగిపోయి, అప్పటి ప్రతిపక్ష, ప్రత్యర్థి పార్టీలపై ఇష్టారీతిగా నోరు పారేసుకున్న వైసీపీ నాయకులకు మరో పార్టీలోకి వెళ్లే అవకాశం లేక, తప్పని సరి పరిస్థితుల్లో వైసీపీలో కొనసాగాల్సిన పరిస్థితి. అందుకే అధికారంలో ఉండగా నోటిని ఒక దూషణల కర్మాగారంగా మార్చుకుని మరీ చెలరేగిపోయిన వారంతా ఇప్పుడు నోరు కట్టేసుకున్నారు. మాట్లాడడానికే జంకుతూ సైలెంటైపో యారు.
అదలా ఉంచితే.. వైసీపీ ఎకో సిస్టమ్ లో ప్రత్యర్థి పార్టీల నేతలతో మాట్లాడకూడదన్న అనధికార బ్యాన్ ఉంటుంది. అది జగన్ గీసిన లక్ష్మణ రేఖగా ఆ పార్టీ నేతలు భావిస్తారు. అందుకే ఇప్పటికీ అంటే.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్న ఘోర పరాజయం తరువాత కూడా వైసీపీయులెవరూ కూటమి నేతలు తెలుగుదేశం కూటమి పార్టీల చెందిన నాయకులను కనీసం పలకరించను కూడా పలకరించరు. అయితే మౌనం, లేకుంటే తిట్ల పురాణం అన్నట్లుగా వారీ తిరు ఉంటుంది. అయితే ఇప్పుడిప్పుడే పార్టీలో ఆ పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తున్నది. జగన్ భయం నుంచి వైసీపీ నేతలు ఒక్కరొక్కరుగా బయటపడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తాజాగా రిపబ్లిక్ డే సందర్బంగా సోమవారం (జనవరి 26) గవర్నర్ ఇచ్చిన తేనీటి విందు (ఎట్ హోం) కార్యక్రమానికి శాసనమండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. అలా హాజరైన బొత్స సత్యనారాయణ.. ఈ కార్యక్రమానికి హాజరైన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేష్ వద్దకు స్వయంగా వెళ్లి, కరచాలనం చేసి ఆత్మీయంగా పలకరించి ముచ్చటించారు. రెండు నిముషాలకు పైగా బొత్స సత్యనారాయణ నారా లోకేష్ తో సరదాగా సంభాషించారు. లోకేష్, బొత్స ఇరువురూ నవ్వుతూ సరదాగా మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి.
ఇదే ఇప్పుడు జగన్ అంటే వైసీపీ నేతలకు భయం పోయిందా అన్న అనుమానాలు వ్యక్తం కావడానికి కారణమయ్యాయి. ఎందుకంటే.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తమ పార్టీ నేతలు ప్రత్యర్థులతో మాట్లాడటం అసలు రుచించదు. రాజకీయ ప్రత్యర్థులు వ్యక్తిగత శత్రువులేనన్నట్లుగా జగన్ భావిస్తారు. వారితో తమ పార్టీ నేతలు ఎవరు మాట్లాడినా, వాళ్లని దూరం పెడతారు. ఈ విషయం బొత్స సత్యనారాయణకు తెలియంది కాదు. గతంలో ఒక సారి జనసేనాని పవన్ కల్యాణ్ తో మాట్లాడి సందర్భంగా ఆయన ఆ పరిస్థితి ఎదుర్కొన్నారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. అయినా కూడా బొత్స సత్యనారాయణ లోకేష్ తో ఆత్మీయంగా పలకరించడం చూస్తుంటే.. జగన్ లెక్కేమిటన్నట్లుగా ఆయన వ్యవహరించినట్లు కనిపిస్తోందని వైసీపీ వర్గాలే అంటున్నాయి. అంతే కాదు.. ఇటీవల నియోజకవర్గ మార్పు విషయంలో మాజీ మంత్రి విడదల రజని సైతం తన అసంతృప్తిని ఒకింత బాహాటంగానే వ్యక్తం చేసిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవలసి ఉంటుంది. అలాగే పేర్ని నాని సైతం తమ పార్టీ అధికారంలో ఉండగా పాలనా పరంగా విఫలమవ్వడమే ఘోర పరాజయానికి కారణమని ఇటీవల వ్యాఖ్యానించారు. ఇవన్నీ చూస్తుంటే.. వైసీపీపై జగన్ పట్టు సడలుతోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పరిశీలకులు అంటున్నారు.