అవును వాళ్లిద్దరూ కొట్టుకుంటున్నారు : బొత్స
posted on Oct 26, 2012 11:22AM
.jpg)
ముఖ్యమంత్రికీ, ఉప ముఖ్యమంత్రికీ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోందన్న వార్తల్ని పిసిసి అధ్యక్షుడు తెలివిగా ధృవీకరించారు. మీడియాలో వస్తున్న వార్తల్ని చూసి తాను ఆ విషయం గురించి తెలుసుకున్నానంటూనే ఇద్దరిమధ్యా విభేదాలున్నాయన్న విషయాన్ని బైటపెట్టారు బొత్స. సింగూరు నీళ్ల విషయంలో ఇద్దరికీ మధ్య తలెత్తిన విభేధాలు తారాస్థాయికి చేరినట్టు సమాచారం. దామోదర్ తండ్రి పేరిట ఎత్తిపోతల పథకాన్ని నిర్మించడానికి మంత్రి సుదర్శన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు దాన్ని ఖండించకుండా ముఖ్యమంత్రి .. సుదర్శన్ రెడ్డికే వత్తాసు పలకడం డెప్యూటీ సీఎంకి ఏమాత్రం రుచించలేదు. అప్పట్నుంచీ ఇద్దరి మధ్యా విభేధాలు బలం పుంజుకుంటూ వచ్చాయ్. చివరికి తన తండ్రి పేరు తీసేసినా ఫర్వాలేదు కానీ.. ఎత్తి పోతల పథకాన్ని మాత్రం ముందుకుతీసుకెళ్లాలని ఉపముఖ్యమంత్రి కోరినప్పటికీ సీఎం సానుకూలంగా స్పందించకపోవడం గమనార్హమైన విషయమని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ చేసిన రాయబారంకూడా విఫలమైనట్టు తెలుస్తోంది.