విజయసాయిరెడ్డి కామెంట్ల వెనక కాషాయ వ్యూహం?
posted on Jan 23, 2026 9:58AM

విజయసాయిరెడ్డి. ఇప్పటి వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు నేతలు పాదయాత్రలు చేస్తే.. వారంతా సీఎంలు అయ్యారు. వారిలో వైయస్ఆర్, చంద్రబాబుతో పాటు జగన్ కూడా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన 3 వేల కిలోమీటర్లకు పైగా ప్రజా సంకల్ప యాత్ర చేయడం, ఆపై ఆ యాత్రలో వివిధ వర్గాల వారిని కలవడం, ఆ తర్వాత వారికి హామీలు ఇవ్వడం.. అటు పిమ్మటు అధికారంలోకి రావడం జరిగింది. అయితే అధికారం చేపట్టినప్పటి నుంచీ.. ఎవరికీ అందుబాటులో ఉండని జగన్ 2024 ఎన్నికలలో అధికారం కోల్పోయారు. తిరిగి అధికారంలోకి రావడం కోసం జగన్ మళ్లీ పాదయాత్ర 2. 0 చేయబోతున్నట్టు ప్రకటించారు.
అయితే జగన్ మరో సారి పాదయాత్ర చేసినా ఆయనకు అధికారం దక్కడం కల్ల అని విజయసాయిరెడ్డి కామెంట్ చేశారు. ఒక విధంగా విజయసాయి జగన్ ఆశలపై నీళ్లు చల్లారని చెప్పాలి. విజయసాయిరెడ్డికి జగనంటే అంత పగేంటి? అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. జగన్ తన ఆశలన్నీ పాదయాత్ర మీదే పెట్టుకున్నారు. అలాంటిది పాదయాత్ర చేసినా కూడా ఆయన తిరిగి అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని విజయసాయి తేల్చి చెప్పేశారు
ఇటీవలి కాలంలో జగన్ ని వెనిజువెలా అధ్యక్షుడితో పోలుస్తూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. చుట్టూ ఉన్న కోటరీ అమ్ముడు పోవడం వల్ల మదురోని ఆయన భార్యతో సహా అమెరికా అరెస్టు చేసినా అక్కడెలాంటి ప్రతిఘటన లేదన్నారు. అదే విధంగా జగన్ పరిస్థితి కూడా ఇక్కడ సరిగ్గా అలాగే ఉందన్న అర్ధం వచ్చేలా విజయసాయి వ్యాఖ్యలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా జగన్ పాదయాత్ర@2 పై కూడా విజయసాయి నెగటివ్ కామెంట్లు చేశారు. అది కూడా బాహటంగా, నిర్భయంగా నిర్మోహమాటంగా విజయసాయి జగన్ మళ్లీ పాదయాత్ర చేసినా ఫలితం ఉండదని కుండబద్దలు కొట్టేశారు. అయితే విజయసాయి వ్యాఖ్యల వెనుక కమల వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇప్పటికే విజయసాయిరెడ్డి, ఆయనతో పాటు మిథున్ రెడ్డి, ఇంకా చెప్పాలంటే.. అవినాష్ రెడ్డి సహా పలువురు వైసీపీ కీలక నేతలు కమల తీర్ధం పుచ్చుకోవడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల అవినాష్ చేసిన ఒక పోస్టు ఆయన కమలం వైపు చూస్తున్నారన్న సంకేతాన్ని ఇచ్చింది. బీజేపీ కూడా ఎవరికి వారుగా కాకుండా ఒక బృందంగా వస్తే ఓకే అంటున్నట్లు సమాచారం. అందులో భాగంగానే వీరంతా కలసి ఇలా బిహేవ్ చేస్తున్నారా? అన్న సందేహాలు పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.