తమిళనాట కొత్త పొత్తు పొడుపు?

జననాయకన్ సినిమా విడుదల, కరూర్ తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. ఇలా తమిళనటుడు, టీవీకే అధినేత విజయ్ ను కష్టాలు ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా వెంటాడుతున్నాయి. సొంత పార్టీ ఏర్పాటు చేసి, ఈ ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధమౌతున్న వేళ విజయ్ ను నాన్ స్టాప్ గా కష్టాలు వెంటాడుతున్నాయి. విజయ్ తన చివరి చిత్రంగా ప్రకటించిన జననాయకన్ సినిమా ఈ పండుగ సందర్భంగా విడుదల అయ్యే అవకాశం లేకుండా పోయింది. సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో విషయం కోర్టు మెట్లెక్కింది. దానికి తోడు  క‌రూర్  తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఇప్పటికే గంటల తరబడి విజయ్ ను విచారించిన సీబీఐ మరో మారు ఈ నెల 19న విచారణకు రావాలని నోటీసులు పంపింది.  

అయితే ఈ వేధింపుల వెనుక ఉన్నది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీయేనని పరిశీలకులు అంటున్నారు. తమిళనాట ఇసుమంతైనా స్టేక్ లేని బీజేపీ విజయ్ తో పొత్తు ద్వారా రాష్ట్రంలో పాగా వేయాలనే ఉద్దేశంతోనే వ్యూహాత్మకంగా విజయ్ ను చక్రvgధంలో ఇరికిస్తోందన్న వ్యాఖ్యలూ వినవస్తున్నాయి. ఇక విజయ్ కు కమలంలో దోస్తీకి సై అనక తప్పదన్న విశ్లేషణలూ వెలువెడ్డాయి. అయితే అనూహ్యంగా విజయ్ కు కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ మద్ద తుగా నిలిచారు.   విజ‌య్ పై  వేధింపుల‌కు పాల్ప‌డ్డం అది త‌మిళ సంప్ర‌దాయాల‌ను భంగ‌ప‌ ర‌చ‌డ‌మే  అవుతుంద‌ని రాహుల్ విమర్శించారు. 

దీంతో విజయ్ పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తుపొడుపునకు అవకాశాలున్నాయా అన్న చర్చకు తెరలేచింది.  ఇప్పటికే విజ‌య్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో తమ పార్టీ  ఎవరితోనూ పొత్తు లేకుండా స్వతంత్రంగానే రంగంలోకి దిగుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. త‌మ‌కు డీఎంకేతో స్థానిక రాజ‌కీయ విబేధాలుంటే, కేంద్ర‌ంలోని  బీజేపీతో సైద్ధాంతిక విబేధాలున్నాయ‌ని చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కూ డీఎంకేతో కలిసి ఉన్న కాంగ్రెస్ స‌డెన్ గా విజ‌య్ కి మద్దతుగా గళం విప్పడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. తమిళనాట కొత్త పొత్తు పొడుపునకు ఇది సంకేతమా అన్న చర్చా జోరుగా సాగుతోంది. 

తొలి నాళ్ల‌లో త‌మిళ‌నాట‌ కాంగ్రెస్ పార్టీ బ‌లంగానే ఉన్నా.. ఆ త‌ర్వాత డీఎంకే, ఏఐడీఎంకే రూపంలో ఈ రెండు పార్టీలే ఇక్క‌డ అధికారం పాల్పంచుకుంటూ వ‌స్తున్నాయి.  కేసీఆర్ లాంటి వారికి ఈ డీఎంకే అన్నాడీఎంకే పాలసీ  ఎంతో ఇష్టం. త‌న కొడుకు కేటీఆర్, అల్లుడు హ‌రీష్ కూడా ఇలాగే రెండుగా  చీలి.. ఇక్క‌డ అధికారం ఎవ‌రో ఒక‌రు పాల్పంచుకోవాల‌ని ఆశిస్తారాయ‌న‌. 

అంత‌గా తమిళనాట స్థానిక రాజ‌కీయాలు గ‌త కొన్నేళ్లుగా పాతుకుపోయాయి. ఇప్పుడు డీఎంకే త‌ర్వాతి త‌రానికి కూడా బ‌లంగా  క‌నిపిస్తున్నా అన్నాడీఏంకేకి జ‌య‌ల‌లిత త‌ర్వాత ఒక దిక్కంటూ లేక పోయింది. శ‌శిక‌ళ రూపంలో బలమైన నాయకురాలు ఉన్నా.. మోడీ  కార‌ణంగా ఆమె అన్నాడీఎంకేకీ ఏమీ కాకుండా పోయారు. ఈ  స్థానంలో ఇక్క‌డ బీజేపీ  పాతుకుపోవాల‌ని తెగ ప్ర‌య‌త్నిస్తుంటే మ‌ధ్య‌లో తమిళనాట అశేష అభిమానం సంపాదించుకున్న హీరో విజయ్.   టీవీకే పార్టీ ఏర్పాటు చేసి రాజకీయ రంగ ప్రవేశం చేసిన విజయ్ అంటే బీజేపీకి ఆగ్రహం.  దానికి తోడు విజ‌య్ కూడా మెర్స‌ల్ వంటి సినిమాల ద్వారా బీజేపీ వ్య‌తిరేక వాణి వినిపించిన ప‌రిస్థితి గ‌తంలో ఉంది. 

వ‌చ్చే త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌య్ పార్టీ టీవీకే పోటీ  చేయ‌నుండ‌టం.. బీజేపీతో ఎలాంటి  పొత్తు ఉండ‌ద‌ని విజ‌య్ ప్ర‌క‌టించ‌డంతో.. ఆయ‌న‌ను వీలైనంతగా త‌మ దారిలోకి తెచ్చుకోడానికి  బీజేపీ అగ్రనాయకత్వం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. దీనిని విజయ్ ఎలా ప్రతిఘటిస్తారు? రాహుల్ విజయ్ కు మద్దతుగా గళం విప్పడం వెనుక కారణమేంటి? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ పార్టీ ప్రభావం ఏ మేరకు ఉండనుంది?  తేలాల్సి ఉంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu