చమురు మంటలతో పచ్చదనం పలచబడిపోతున్న కోససీమ
posted on Jan 10, 2026 10:06AM

భూమికి పచ్చని రంగేసినట్లు హరిత శోభతో కళకళలాడే కోనసీమ ఇప్పుడు చమురు మంటల వేడి సెగలకు మాడిపోతోంది. పచ్చదనం పలచబడిపోతోంది. కోనసీమ తీర ప్రాంతంలో అపార చమురు, సహజవాయు నిక్షేపాలున్నయన్న సంగతి వెలుగు చూసినప్పటి నుంచీ ఇక్కడి పచ్చదనానికి శాపం తగిలిందోమో అనిపిస్తుంది. ఓఎన్జీసీ చమురు, సహజవాయు అన్వేషణ ప్రారంభించిందో అప్పటి నుంచే కోనసీమ పచ్చదనం పలచబడిపోవడం మొదలైంది. ఢ్రిల్లింగ్ పేరుతో తీర ప్రాంతంలో ఇష్టారీతిగా రిగ్గులు వేసేసిన ఓఎన్జీసీ.. అప్పటి నుంచే కోనసీమ వాసుల ఆరోగ్యంపై ప్రభావం పడటం మొదలైంది. తీర ప్రాంత గ్రామాల వారు కాలేయ సంబంధిత వ్యాధులకు గురి కావడం మొదలైంది. ఇదంతా చమురు, సహజవాయువు అన్వేషణ పేరుతో ఎఎన్జీసీ చేస్తున్న ప్రకృతి విధ్వంసం ఫలితమే అంటున్నారు వైద్య నిపుణులు, పర్యావరణ ప్రేమికులు.
సరిగ్గా మూడు దశాబ్దాల కిందట ఇదే కోనసీమలోని పాశర్లపూడి గ్రామంలో వచ్చిన బ్లోఅవుట్‌తో కోనసీమ ఉలిక్కిపడింది. అంతకు ముందు ప్రకృతి వైపరిత్యాలను మాత్రమే అనుభవించిన కోనసీమ ప్రజ మానవ తప్పిదం కారణంగా తీరని నష్టాన్ని చవి చూసింది. ఆ తరువాత కూడా బ్లో ఔట్ లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కోనసీమలోని ఇరుసుమండ గ్రామంలో బ్లోఔట్ సంభవించింది. వారం రోజులుగా మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి. పచ్చని కొబ్బరి చెట్లు మూడు నాలుగు నిలువుల బొగ్గు చెట్లుగా మారిపోయాయి. కోనసీమలో భోగి మంటను ఓఎన్జీసీ ముందే వేసేసిందనీ, సంక్రాంతి పండగకు ముందు జరుపుకునే భోగి భోగభాగ్యాలను తీసుకువస్తుందంటారు. కానీ.. ఓఎన్జీసీ వేసిన ఈ భోగి మంట భోగభాగ్యాలను తుడిచేస్తోందనీ ఈ ప్రాంత వాసులు అంటున్నారు.
ఇక ఇప్పుడు ఓఎన్జీసీ ఈ బ్లోఔట్ ను ఆపడం సాధ్యం కాదని తేల్చేసింది. మంటలు ఎగసిపడుతున్న బావిని శాశ్వతంగా మూసేయడమే మర్గమని నిర్ణయించింది. మూడు దశాబ్దాల కిందట పాశర్లపూడి బ్లో ఔట్ సమయంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు ఈ బ్లో ఔట్ సంభవించిన బావిని మూసేయాలంటే భారీ మడ్ ఫిల్లింగ్ యంత్రాలను సంఘటనా స్థలానికి తరలించడానికి పచ్చటి పొలాలకు అడ్డంగా భారీ రోడ్ల నిర్మాణం చేపట్టాలి. ఓఎన్జీసీ ఇప్పటికే ఆ పని మొదలెట్టేసింది. మొత్తంగా కోనసీమ చమురు, సహజవాయువుల నిక్షేపాల గని అని సంబరపడటానికి లేకుండా, వాటి వెలికితీత, అన్వేషణ చర్యల కారణంగా నిత్య రావణకాష్టంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.