ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం.. విజయసాయి, మిథున్ రెడ్డి.. ఈడీ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే?
posted on Jan 20, 2026 2:50PM

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఇంత కాలంగా అధికారులు, కీలక వ్యక్తులు అంటూ పలువురిని విచారించిన ఆధారాలు సేకరించిన ఈడీ ఇప్పుడు ఈ కుంభకోణంలోని పొలిటికల్ లింకులను బయటపెట్టే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఒక రోజు వ్యవధిలో ఇద్దరు కీలక వ్యక్తులకు విచారణకు రావలసిందిగా నోటీసులు జారీ చేసింది. దర్యాప్తులో భాగంగా నోటీసులు జారీ చేసి విచారణకు పిలవడంలో వింతేముంది అనుకోవచ్చు.. కానీ ఈడీ నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచిన వ్యక్తులు సామాన్యులు కాదు. ఇద్దరూ కూడా వైసీపీలో అత్యంత కీలకంగా వ్యవహరించిన వారే. వారిలో ఒకరు విజయసాయిరెడ్డి. ఈయన జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచీ ఇటీవలి కాలం వరకూ జగన్ కు కుడి ఎడమ భుజాలై పార్టీ వ్యవహారాలను నడిపారు.
అన్నిటికీ మించి.. జగన్ అక్రమాస్తుల కేసులో కూడా జగన్ తో పాటు సహ నిందితుడు. 2024 ఎన్నికలలో వైసీపీ ఓటమి తరువాత ఆయన వైసీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారనుకోండి అది వేరు సంగతి. ఇక ఈడీ నోటీసులు అందుకున్న రెండో వ్యక్తి వైసీపీ సీనియర్ నేత, ఎంపీ మిథున్ రెడ్డి. ఈయనకు జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. వీరిలో విజయసాయిరెడ్డిని ఈడీ ఈ నెల 22న అంటే గురువారం విచారించనుంది. ఇక మిథున్ రెడ్డిని ఆ మరుసటి రోజు అంటే శుక్రవారం (జనవరి 23) విచారణకు పిలిచింది. వరుస రోజులలో ఇరువురినీ విచారించడానికి ఈడీ నిర్ణయించడం కూడా రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ మద్యం విధాన రూపకల్పన, అమలులో ఈ ఇరువురిదే కీలక పాత్ర అన్న ఆరోపణలు బలంగా ఉన్న సంగతి తెలిసిందే.
ఇక పోతే ఈ కుంభకోణం కేసులో మిథున్ రెడ్డిని ఇప్పటికే సిట్ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన బెయిలుపై ఉన్నారు. విజయసాయి అరెస్టు కాలేదు కానీ దర్యాప్తు సంస్థ నిఘాలో ఉన్నారని పరిశీలకులు అంటున్నారు. అన్నిటికీ మించి ఈ కేసులో ఆయన అప్రూవర్ గా మారే అవకాశం ఉందన్న అంచనాలు కూడా ఆయనను ఇప్పటి వరకూ సిట్ విచారణకు పిలవడం తప్ప అరెస్టు చేయలేదన్న ప్రచారమూ ఉంది. సరే అదలా ఉంచితే.. ఇప్పుడు వరుసగా విజయసాయి, మిథున్ రెడ్డిలను విచారణకు పిలిచి స్పీడ్ మీద ఉన్న సిట్ ఇదే దూకుడు కనబరిస్తే.. తదుపరి నోటీసులు ఎవరికి అన్న చర్చ జోరుగా సాగుతోంది. పరిశీలకులు అయితే.. వీరిద్దరి తరువాత ఈడీ విచారణ చేయాల్సింది జగన్ నేనని అంటున్నారు. దర్యాప్తు జగన్ దగ్గరకు వెళ్లడానికి విజయసాయి, మిథున్ రెడ్డిల విచారణ బాట పరుస్తుందని అంటున్నారు.
ఎందుకంటే..మద్యం కుంభకోణం సోమ్ముల మనీల్యాండరింగ్ లో మిథున్ రెడ్డిదే కీలక పాత్ర అని ఇప్పటికే ఈడీ ప్రాథమికంగా అంచనాకు వచ్చిందంటున్నారు. కుంభకోణం సొమ్ముల సేకరణ,వాటి రూటింగ్ లెక్కలను ‘పై’కి చేరవేయడం వంటి విషయంలో మిథున్ రెడ్డే పాత్రధారి, సూత్రధారి అన్న ఆరోపణల నేపథ్యంలో మిథున్ రెడ్డి విచారణ కీలక అంశాలను బయటపెట్టే అవకాశం ఉందంటున్నారు. ఇక విజయసాయి రెడ్డి విషయానికి వస్తే.. ఇప్పటికే ఆయన మద్యం కుంభకోణం వ్యవహారంలో సిట్ ఎదుటే చెప్పాల్సింది, చెప్పగలిగింది అంతా చెప్పేశారు. ఈ నేపథ్యంలో ఈడీ దర్యాప్తు తదుపరి అడుగు జగన్ తాడేపల్లి ప్యాలెస్ తలుపులు తడుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.